ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు: జగన్

Six fishermen died due to government negligence says Jagan
  • మత్స్యకార మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్
  • మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ
  • ఆ రోజు రాత్రి 10.30 గంటలకు బాధితులు కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టినా స్పందించలేదని ఆగ్రహం
మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ నెల 4న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. విశాఖపట్నం సమీపంలోని జబ్బర్ తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను, ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాను జగన్ పరామర్శించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తీరానికి 10 మైళ్ల దూరంలోనే ఘటన జరిగినా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు మత్స్యకారులు జలసమాధి అయ్యారని దుయ్యబట్టారు. ఆ రోజు రాత్రి 10.30 గంటలకు బాధితులు కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టినా స్పందించలేదన్నారు. 5వ తేదీన చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడటంతో అతను బ్రతికి బయటపడ్డాడని తెలిపారు. 

ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారని, ఆ నివేదిక కూడా తప్పులతడకగా ఉందన్నారు. ప్రభుత్వానికి మానవత్వం లేదని, ఉంటే రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు కాదన్నారు. ఇప్పటికైనా బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెలలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Visakhapatnam boat accident
Andhra Pradesh fishermen deaths
Jagan Mohan Reddy Vizag visit
Fisherman ex gratia demand
YSRCP vs TDP alliance

More Telugu News