మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదా?.. సీబీఎస్‌ఈ క్లారిటీ

CBSE updates class 10 third language exam guidelines for students
  • మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదు
  • పాఠశాల అంతర్గత పరీక్ష తప్పనిసరి
  • పాస్‌ అయితేనే 10వ సర్టిఫికెట్‌
  • ఫెయిల్‌ అయితే మరో అవకాశం
  • 2026-27లో 10వ చదివేవారికి మార్పుల్లేవు
  • 6వ తరగతి కొత్త బ్యాచ్‌కు తర్వాత బోర్డు పరీక్షలో మూడో భాష
సీబీఎస్‌ఈ 10వ తరగతి విద్యార్థుల మూడో భాష పరీక్షపై వస్తున్న సందేహాలకు బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం 9వ తరగతిలో చేరిన విద్యార్థులకు 10వ తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదని ప్రకటించింది. అయితే పాస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే ఆ భాషలో పాఠశాల నిర్వహించే అంతర్గత మూల్యాంకన పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది.

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020లో భాగంగా అమలు చేస్తున్న మూడు భాషల విధానంపై జులై 10న విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో చేరే విద్యార్థులు మూడు భాషలు చదవాల్సి ఉంటుందని, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని పేర్కొంది. అయితే ఈ బ్యాచ్‌ విద్యార్థులకు 10వ తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష నిర్వహించబోమని తెలిపింది.

పాఠశాల నిర్వహించే మూడో భాష అంతర్గత మూల్యాంకన పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని సీబీఎస్‌ఈ పాఠశాలలను ఆదేశించింది. 10వ తరగతి బోర్డు ఫలితాలు విడుదలయ్యేలోపు రీ-అసెస్‌మెంట్‌ నిర్వహించి అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పించాలని సూచించింది. అలాగే 9వ తరగతిలో మూడో భాషలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్‌ చేసినా, తర్వాతి విద్యా సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న పరీక్షను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.

2026-27లో ఇప్పటికే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు భాషల విధానమే వారికి కొనసాగుతుందని తెలిపింది. ఇక 2026-27 నుంచి 6వ తరగతిలో చేరే విద్యార్థులు 10వ తరగతికి వచ్చే సమయానికి మూడో భాష కూడా బోర్డు పరీక్షలో భాగం కానుందని వెల్లడించింది. అప్పటికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, సిలబస్‌, ఇతర విద్యా వనరులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
Advertisement
CBSE
Class 10 Board Exams
Third Language Policy
NEP 2020 Guidelines
Internal Assessment Rules
School Education India

More Telugu News