ప్రపంచంలోనే తొలి 'ఏజెంటిక్‌' ఫోన్‌.. ఇందులో అంత స్పెషల్‌ ఏముంది?

  • స్టెప్‌ఫన్‌ నుంచి ‘స్టెప్‌ఎక్స్‌ నియో’ ఫోన్‌ ఆవిష్కరణ
  • ప్రపంచంలో తొలి ఏజెంటిక్‌ ఫోన్‌గా కంపెనీ ప్రకటన
  • ఏఐ అసిస్టెంట్‌ స్వయంగా పనులు పూర్తి చేస్తుందన్న సంస్థ
  • 32 భాషల్లో ప్రత్యక్ష అనువాద సదుపాయం
  • ట్రిప్‌ ప్లానింగ్‌, బుకింగ్‌లు కూడా ఏఐతోనే
చైనాకు చెందిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సంస్థ స్టెప్‌ఫన్‌ ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్‌ స్మార్ట్‌ఫోన్‌గా ‘స్టెప్‌ఎక్స్‌ నియో’ను ఆవిష్కరించింది. యూజర్‌ తరఫున స్వయంగా పలు పనులను పూర్తి చేసే ఏఐ అసిస్టెంట్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఒక్కో యాప్‌లోకి వెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేకుండా, ఒకే ఆదేశంతో అనేక పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు వెల్లడించింది.

స్టెప్‌ఎక్స్‌ నియోలో ‘స్టెప్‌ అమూ’ పేరుతో ప్రత్యేక ఏఐ అసిస్టెంట్‌ను అందించారు. ఇది సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనే పనిచేస్తుంది. సహజ భాషలో ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకొని పలు యాప్‌ల మధ్య సమన్వయం చేస్తూ క్లిష్టమైన పనులను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రయాణం ప్లాన్‌ చేయమని చెబితే విమాన టికెట్లు వెతకడం, హోటల్‌ సూచించడం, బుకింగ్‌లు పూర్తి చేయడం, ప్రయాణ వివరాలను సేవ్‌ చేయడం వంటి పనులను స్వయంగా నిర్వహిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌లో 32 భాషలు, ప్రాంతీయ మాండలికాల్లో ప్రత్యక్ష అనువాదం చేసే సదుపాయం కూడా ఉంది. ప్రత్యక్ష సంభాషణలు, ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, కెమెరాతో స్కాన్‌ చేసిన టెక్స్ట్‌ను కూడా వెంటనే అనువదించగలదని పేర్కొంది. అంతేకాదు స్థానిక రవాణా వివరాలు, సమీప పర్యాటక ప్రాంతాలు, ఆఫ్‌లైన్‌లో సేవ్‌ చేసిన ప్రయాణ వివరాలు, ఫ్లైట్‌ చెక్‌-ఇన్‌ రిమైండర్లు, వీసా సమాచారం, కస్టమ్స్‌ పత్రాలకు సంబంధించిన సాయం కూడా అందిస్తుందని వెల్లడించింది.

స్టెప్‌ఫన్‌ రూపొందించిన స్టెప్‌ ఏఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఫోన్‌లోనే ఏఐ ప్రాసెసింగ్‌ జరిగేలా ప్రత్యేక ఫౌండేషన్‌ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే చైనాలోని సీట్రిప్‌, అలీపే, డిడీ, మీటువాన్‌, డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్‌, క్యాప్‌కట్‌ వంటి ప్రముఖ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో ఫోన్‌ మరిన్ని పనులను స్వయంగా నిర్వహించగలదని పేర్కొంది.
Advertisement

More Telugu News