వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఎదురుచూపులకు తెర.. కేంద్రం కీలక హామీ!

Warangal Mamnoor Airport tender process starts within four weeks says Ram Mohan Naidu
  • మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామన్న కేంద్ర మంత్రి
  • 2028 జూన్‌ 2 నాటికి పూర్తి చేస్తామని రామ్మోహన్‌ నాయుడి హామీ
  • 253 ఎకరాలు ఇచ్చిన రాష్ట్రానికి కేంద్రం ప్రశంస
  • ఆదిలాబాద్‌లో 1,500 ఎకరాల భూసేకరణ
  • కేంద్ర సహకారంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌
వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరో మూడు, నాలుగు వారాల్లో టెండర్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని  పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. 2028 జూన్‌ 2 నాటికి ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమైన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు.

సమావేశంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించినట్లు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 253 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి అప్పగించిందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తన హయాంలో తెలంగాణకు ఎయిర్‌పోర్టులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపైనా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 1,500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రక్షణ శాఖకు కూడా ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అవసరమని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోందని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడి సహకారం మరువలేనిదని చెప్పారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని కోరుకుంటోందని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ ఐదు శాతం వాటా అందిస్తోందని పేర్కొన్నారు.
Advertisement
Warangal Mamnoor Airport
Ram Mohan Naidu
Revanth Reddy
Adilabad Airport
Civil Aviation Ministry
Telangana Airport Development

More Telugu News