బ్యారేజీ గేట్లు మూస్తే కూలిపోతాయి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక

Revanth Reddy warns barrages will collapse if gates are closed
  • కాళేశ్వరం బ్యారేజీల గేట్లు మూయడం ప్రమాదకరమని ముఖ్యమంత్రి హెచ్చరిక
  • పునరుద్ధరణ పూర్తయ్యే వరకు గేట్లు తెరిచే ఉంచాలని స్పష్టీకరణ
  • జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారమే మరమ్మతులు
  • బీఆర్ఎస్ నేతల కమిటీ సిఫార్సులను పక్కనపెడుతున్నట్టు వెల్లడి
  • గత ప్రభుత్వ అవినీతి వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి అని విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తికాకుండా గేట్లు మూసివేస్తే, వాటి మనుగడకే పెను ప్రమాదం వాటిల్లుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బ్యారేజీల భద్రత విషయంలో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను తు.చ. తప్పకుండా పాటించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డను వెన్నెముకగా, శ్రీపాద యల్లంపల్లిని గుండెకాయగా అభివర్ణించారు. మేడిగడ్డ నిర్మాణ సమయంలో ఎదురయ్యే సవాళ్లపై గత ప్రభుత్వ హయాంలోనే ఇంజనీర్లు హెచ్చరించినప్పటికీ, కొందరు అధికారులు ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్యారేజీల పునరుద్ధరణ కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చేసిన సూచనలనే తమ ప్రభుత్వం పాటిస్తుందని, బీఆర్ఎస్ నేతలతో కూడిన కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చిచెప్పారు.

"పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకుండా గేట్లు మూసివేస్తే బ్యారేజీలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణాలు స్థిరంగా ఉన్నప్పుడే నీటి నిల్వ, పంపింగ్ సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి మేడిగడ్డలో కనీసం 5 టీఎంసీల నీటి నిల్వ అవసరమని, అయితే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిపుణుల సలహాల మేరకే తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, లోపభూయిష్టమైన ప్రణాళికల వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి దాపురించిందని ముఖ్యమంత్రి విమర్శించారు. భద్రాచలం వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యేలా నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదని, ప్రజల భద్రతకు, ప్రభుత్వ వనరులకు నష్టం కలగకుండా ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Revanth Reddy
Kaleshwaram Project
Medigadda Barrage
Telangana Government
National Dam Safety Authority
Telangana News

More Telugu News