మరో బోటు ప్రమాదం.. సముద్రంలో మంటలు అంటుకుని ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు
- కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో ప్రమాదం
- భోజనం వండేందుకు స్టవ్ ఆన్ చేయగా అంటుకున్న మంటలు
- అందరినీ రక్షించిన మరో బోటులోని మత్స్యకారులు
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న మత్స్యకారుల బోటు ప్రమాదాలు తీరప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేశ్, ఎరుపల్లి ప్రసాద్ అనే ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరు మరికొంతమందితో కలిసి సముద్రంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేటకు వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు బోటులో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగి పడవ మొత్తానికి వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు మత్స్యకారులంతా సముద్రంలోకి దూకేశారు.
సమీపంలోనే వేరే బోటులో ఉన్న తోటి మత్స్యకారులు దీనిని గమనించి, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ రక్షించారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్, ప్రసాద్‌లను వెంటనే తునిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒక బోటు ప్రమాదాల్లో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కాగా.. మరో బోటు ప్రమాదంలో 10 మందిని సురక్షితంగా కాపాడిన సంగతి తెలిసిందే.