ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజుల కింద‌ ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) కన్నుమూసిన విష‌యం తెలిసిందే. 'హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్' అనే అరుదైన రుగ్మతతో చాలా కాలంగా పోరాడుతున్న జద్రాన్, న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తన 39వ పుట్టినరోజుకు కేవలం ఒక్కరోజు ముందు మరణించడం అభిమానులను, సహచరులను తీవ్రంగా కలచివేసింది.

షాపూర్ మృతివార్త తెలియగానే ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), ఆటగాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ మాజీ సహచరుడికి నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కన్నీటిపర్యంతమయ్యారు. జద్రాన్‌ను స్మరించుకుంటూ వారు భావోద్వేగానికి గురైన‌ దృశ్యాలు ఆఫ్ఘన్ జట్టులోని అనుబంధాన్ని తెలియజేశాయి.

ఆఫ్ఘన్ క్రికెట్ ప్రస్థానంలో షాపూర్ జద్రాన్ ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు. తన పేస్, దూకుడైన సంబరాలతో గుర్తింపు పొందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, 2009 నుంచి 2020 మధ్య దేశం తరఫున 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 80 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2015 ప్రపంచకప్‌లో ఆఫ్ఘన్ సాధించిన మొట్టమొదటి చారిత్రక విజయంలో అత‌డు కీలకపాత్ర పోషించాడు. స్కాట్లాండ్‌పై జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చివరి వికెట్‌కు క్రీజులో నిలిచి, గెలుపు పరుగులు సాధించి దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

"గౌరవం, ధైర్యం, గర్వంతో దేశానికి సేవ చేసిన ఆటగాడు షాపూర్" అని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో కొనియాడింది. అతని పోరాట స్ఫూర్తి ఎందరో యువ క్రికెటర్లకు ఆశను, ప్రేరణను ఇచ్చిందని పేర్కొంది. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి జద్రాన్ భారత్‌లో చికిత్స పొందాడు. రషీద్ ఖాన్, ఏసీబీ అధికారులు అతడికి మెడికల్ వీసా వేగంగా వచ్చేలా సాయపడ్డారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ తరచూ అత‌డిని పరామర్శించ‌డం జ‌రిగింది. మొదట కోలుకుంటున్నట్లు కనిపించినా, డెంగ్యూ, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా అత‌ని ఆరోగ్యం క్షీణించింది.

షాపూర్ జద్రాన్ మృతి పట్ల ఐసీసీ ఛైర్మన్ జై షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ క్రికెట్‌కు అతడు చేసిన సేవలను కొనియాడారు. జద్రాన్ భౌతికకాయాన్ని కాబూల్‌కు తరలించి, ఈద్గా మసీదులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, అధికారులు, అభిమానులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.