ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించాం: నాదెండ్ల మనోహర్
- రైతులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సెమినార్
- రెండో ఏడాది 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న మనోహర్
- 95 శాతం చెల్లింపులను 24 గంటల్లో పూర్తి చేశామన్న మంత్రి
కూటమి ప్రభుత్వంలో రెండేళ్ల ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తి కావడంతో విజయవాడలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులు, రైస్ మిల్లర్లతో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు తెచ్చామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలో ఏకంగా 74 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి రికార్డు సృష్టించిందన్నారు. రూ. 31 వేల కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి, 11.53 లక్షల మంది రైతులకు 95 శాతం చెల్లింపులను 24 గంటల్లోనే పూర్తి చేశామని తెలిపారు.
ఏపీ తెచ్చిన '10 శాతం బ్రోకెన్ రైస్' విధానాన్ని కేంద్రం కూడా గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయనుందని చెప్పారు. క్యూఆర్ కోడ్, వాట్సాప్ బుకింగ్, మాయిశ్చర్ మీటర్ల ద్వారా కొనుగోళ్లలో పారదర్శకత పెంచామని, రానున్న సీజన్‌లో ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా రైతులను సన్నద్ధం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.