అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక!

JD Vance warns against H1B visa abuse saying American jobs must go to Americans
  • వీసా మోసాలకు పాల్పడుతున్న వారిపై కార్మికశాఖ దర్యాప్తు ప్రారంభించిందన్న వాన్స్
  • ప్రతిభ కలిగిన వారికోసం హెచ్-1బీ వీసాలను రూపొందించామని వెల్లడి
  • కొన్ని పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపాటు

హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి పాల్పడుతూ, నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "అమెరికా ఉద్యోగాలు ప్రాథమికంగా అమెరికన్లకే దక్కాలి" అని ఆయన స్పష్టం చేశారు. వీసా మోసాలకు పాల్పడుతున్న వారిపై అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే విస్తృతస్థాయిలో దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం పలువురికి నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.


ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఐటీ వంటి రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చి సేవలందించేందుకు వీలుగా హెచ్-1బీ వీసాను రూపొందించామని... కానీ కొన్ని పెద్ద కంపెనీలు, కన్సల్టెన్సీలు ఈ విధానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయని వాన్స్ మండిపడ్డారు. విదేశాల నుంచి తక్కువ వేతనాలకే ఉద్యోగులను తెచ్చుకుంటూ... అమెరికాలోని స్థానిక కార్మికుల ఉపాధి అవకాశాలను కొన్ని కంపెనీలు దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు.


పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడటంతో పాటు వీసా మోసాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వాన్స్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారికి అమెరికాలోకి ప్రవేశం కూడా ఉండదని హెచ్చరించారు. అమెరికా కార్మిక శాఖ చేపట్టిన ఈ ఆకస్మిక దర్యాప్తులతో, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, అక్కడ పనిచేస్తున్న కన్సల్టెన్సీల్లో ప్రస్తుతం తీవ్ర కలకలం రేగుతోంది.
Advertisement
JD Vance
H1B Visa Abuse
US Jobs for Americans
US Department of Labor
Indian IT Professionals
Visa Fraud Investigation

More Telugu News