నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు

TGSRTC to recruit 1500 conductors in Telangana
  • పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాల భర్తీ
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నియామకాలు
  • పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలు

నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టబోతుండగా... చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో పర్మినెంట్ (శాశ్వత) ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం విశేషం.


ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు ఊరటనిచ్చే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం లేదు. కేవలం టెన్త్ క్లాస్ లో సాధించిన మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను సిద్ధం చేసి నేరుగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఎలాంటి పోటీ పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే సువర్ణావకాశం కావడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పర్మినెంట్ బేసిస్‌పై కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా చాలా మంది ఉద్యోగులు రిటైర్ కావడంతో ఖాళీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటివరకు తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే బస్సులను నడిపించారు. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంతో ఆర్టీసీ రూపురేఖలు మారనున్నాయి.


అయితే, అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలకు ముందు ఒక చిన్న సాంకేతిక సమస్య ఎదురైంది. గతంలో ఎస్‌ఎస్‌సీ బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు జీపీఏ (GPA) గ్రేడింగ్ విధానాన్ని తెచ్చింది. మళ్లీ ఇటీవల మార్కుల విధానాన్ని కొనసాగిస్తోంది. దీనివల్ల అప్లై చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి కేవలం గ్రేడింగ్ మాత్రమే సర్టిఫికేట్లలో ఉన్నాయి.


దీంతో జీపీఏ గ్రేడింగ్‌ను మార్కుల శాతంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇరు విధానాల అభ్యర్థులను సమానంగా ఎలా అంచనా వేయాలనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు లేఖ రాశారు. బోర్డు నుంచి ఈ మార్గదర్శకాలు (Guidelines) అందిన వెంటనే కండక్టర్ ఉద్యోగాల అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.

Advertisement
TGSRTC
Telangana Conductor Recruitment
1500 Conductor Jobs
Telangana Government Jobs
SSC Merit Jobs
TGSRTC Notification

More Telugu News