అర్జెంటీనాలో గాల్లో ప్రయాణిస్తున్న శిక్షణ విమానం నుంచి ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ అకస్మాత్తుగా కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, 22 ఏళ్ల ట్రైనీ పైలట్ ధైర్యం కోల్పోకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది.

కార్డోబా ప్రావిన్స్‌లోని టోలెడో సమీపంలో గత శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. 'ఫ్లయింగ్ ప్యారెట్ కార్డోబా' ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన 42 ఏళ్ల ఇన్‌స్ట్రక్టర్ లియాండ్రో ఆండ్రెస్ బెర్టాజో, రోసారియో అనే యువతికి సెస్నా 150 విమానంలో శిక్షణ ఇస్తున్నారు. ఆ సమయంలో బెర్టాజో, "నువ్వేం చేయాలో నీకు తెలుసు, కానివ్వు" అని రోసారియోతో చెప్పి, తన హెడ్‌సెట్, సీట్‌బెల్ట్ తొలగించి విమానం తలుపులు తెరిచి కిందకు దూకేశాడు.

ఈ అనూహ్య పరిణామంతో రోసారియో తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, వెంటనే తేరుకుని ధైర్యం కూడగట్టుకుంది. గ్రౌండ్ సిబ్బంది సూచనలను పాటిస్తూ కరోనల్ ఓల్మెడో విమానాశ్రయంలో విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేసింది. 

ఫ్లయింగ్ స్కూల్ డైరెక్టర్ ఎడ్వర్డో అల్వారెజ్ మాట్లాడుతూ, ఈ ఘటనకు ముందు బెర్టాజో మరో శిక్షణ విమానాన్ని నడిపారని, అప్పుడు ఆయనలో ఎలాంటి అసాధారణ మార్పులు కనిపించలేదని తెలిపారు. "అతడు ఎంతో మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ విషాదకర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం అధికారులు బెర్టాజో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, అతడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రైనీ పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించిందని అధికారులు ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు.