ఈ ఉచిత పథకాలు ఎవరడిగారు?: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

Who asked for these free schemes High Court expresses anger at Telangana Government
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు సందేహాలు
  • శాసనసభ ఆమోదం లేకుండా ప్రజాధనం పంపిణీపై ప్రభుత్వానికి ప్రశ్నలు
  • ఉద్యోగుల జీతాలు, బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఉచితాలపై ఆగ్రహం
  • నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ పథకాలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ బుధవారం విచారించారు. చట్టసభ ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 245, 246లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ పథకాలకు సంబంధించి జారీ చేసిన 8 జీవోలను రద్దు చేయాలని కోరారు.

విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి, కాంట్రాక్టర్ల బిల్లులు, భూసేకరణ పరిహారం వంటివి పెండింగ్‌లో ఉన్నాయి, నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత పథకాలను ఎవరు అడిగారు?" అని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వం వద్ద అదనపు నిధులు ఉంటే ఉచితాలు ఇవ్వవచ్చని, కానీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రాధాన్యత ఉండాలని హితవు పలికింది.

2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద ఇప్పటివరకు రూ.13,484 కోట్లు ఖర్చు చేశారని, కాగ్ నివేదికల ప్రకారం సుమారు రూ.90 కోట్లు అనర్హులకు అందాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్, నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. అయితే, ఈ పథకాలపై తక్షణ స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Advertisement
Telangana High Court
Kalyana Lakshmi Scheme
Shaadi Mubarak Scheme
Telangana Government

More Telugu News