ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్‌ ఛార్జీలు 10% పెంపు

Chandrababu Naidu increases diet charges for AP students by 10 percent
  • హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్‌ ఛార్జీల పెంపు
  • రూ.100 కోట్లతో హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు
  • ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాలు, మెరుగైన వసతులకు సీఎం ఆదేశం
  • ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సూచన
  • పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కంపెనీలకు సీఎం ఆదేశం
  • కనీస మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోళ్లు జరపాలని సూచన
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి అందించే డైట్‌ ఛార్జీలను 10 శాతం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పెంపును వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలన్న ఆర్థిక శాఖ సూచనను సీఎం తిరస్కరించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెంపు అమల్లోకి రావాలని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జీవితాల్లో మార్పు వస్తుందని, అందుకే వారికి అన్ని విధాలా మెరుగైన అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ శాఖల సమీక్షలో ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. హాస్టళ్ల స్థానంలో మరిన్ని గురుకులాలు నిర్మించాలని, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల మరమ్మత్తులకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతిభావంతులైన ఇంటర్‌ విద్యార్థులకు పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే సంక్షేమ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.

పొగాకు కొనుగోళ్లపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కిలోకు రూ.200 కనీస మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోళ్లు జరపాలని కంపెనీలను ఆదేశించారు. ఇండెంట్‌ ఇచ్చి కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. టొబాకో బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, రైతుల నమ్మకాన్ని దెబ్బతీసే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే అవసరానికి మించి పొగాకు సాగు కావడం, ఎగుమతులు తగ్గడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని అధికారులు, కంపెనీల ప్రతినిధులు సీఎంకు వివరించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Students
Diet Charges Hike
Government Hostels
Gurukul Schools
Tobacco MSP

More Telugu News