‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా?
- పిల్లలను బలవంతంగా ప్రదర్శన చేయించడం మంచిది కాదంటున్న నిపుణులు
- ఇష్టంలేక చేసినప్పుడు ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిక
- ‘వద్దు’ అని చెప్పడానికి పిల్లలు భయపడే అవకాశం
- ఇతరుల ప్రశంసలకే విలువ ఇస్తారనే భావన పెరుగుతుంది
- పిల్లలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
- వారి నిర్ణయాన్ని గౌరవిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఇంటికి బంధువులు వస్తే.. ‘‘మా బాబు 100 వరకు లెక్క చెబుతాడు’’, ‘‘మా పాప డ్యాన్స్ అదిరిపోతుంది’’ అంటూ గర్వంగా చెప్పడం చాలా ఇళ్లలో కనిపించే దృశ్యం. అది మనకు బాగానే ఉంటుంది. కానీ వెంటనే ‘‘రా.. ఒకసారి అందరికీ చేసి చూపించు’’ అని పిల్లలను బలవంతం చేయడం మొదలవుతుంది. చాలామంది దీన్ని చిన్న విషయంగానే భావిస్తారు. కానీ పిల్లల మనసులో మాత్రం ఇది పెద్ద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్న ఒత్తిడి.. పెద్ద ప్రభావం
పిల్లలు ఇష్టపడి పాట పాడినా, డ్యాన్స్ చేసినా ఎలాంటి సమస్య ఉండదు. కానీ చేయాలని లేకపోయినా పెద్దల ఒత్తిడితో చేయాల్సి వస్తే పరిస్థితి మారిపోతుంది. ‘‘ఎందుకు సిగ్గుపడుతున్నావు?’’, ‘‘ఒక్కసారి చేస్తే ఏమవుతుంది?’’, ‘‘మమ్మల్ని అవమానపరచొద్దు’’లాంటి మాటలు పిల్లల్లో అనవసరమైన ఒత్తిడిని పెంచుతాయి. తల్లిదండ్రులను నిరాశపరచకూడదనే భావనతో వారు ఇష్టం లేకపోయినా అంగీకరిస్తారు.
మనసులో ఏముంటుంది?
అలాంటి సమయంలో పిల్లల మనసులో ఎన్నో సందేహాలు తిరుగుతుంటాయి. ‘‘నేను తప్పు చేస్తే?’’, ‘‘చేయనంటే అమ్మానాన్న కోప్పడతారా?’’, ‘‘అందరూ నన్ను చెడ్డ పిల్లాడని అనుకుంటారా?’’లాంటి ఆలోచనలు వెంటాడతాయి. ఈ భావాలను మాటల్లో చెప్పలేకపోయినా, లోపల మాత్రం తీవ్ర ఆందోళనను అనుభవిస్తుంటారు.
తప్పు సంకేతం
తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే పిల్లలకు ఓ తప్పు సందేశం చేరుతుంది. తమ భావాల కంటే ఇతరులను సంతోషపెట్టడమే ముఖ్యమని వారు నమ్మడం మొదలుపెడతారు. క్రమంగా అందరి ప్రశంసల కోసమే ప్రయత్నించడం, ‘వద్దు’ అని చెప్పడానికి భయపడటం, తమ విలువను ప్రతిభతో ముడిపెట్టుకోవడం, ఎవరినైనా నిరాశపరుస్తానేమోననే ఆందోళన పెరగడం వంటి మార్పులు కనిపించొచ్చు.
ఒక్కసారి ఆలోచించండి
ఇదే పరిస్థితి పెద్దలపై వస్తే ఎలా ఉంటుంది? ఇంటికి అతిథులు రాగానే ‘‘ఒక పాట పాడండి’’, ‘‘మీ టాలెంట్ చూపించండి’’ అంటే చాలామందికి అసౌకర్యంగానే ఉంటుంది. అయితే పిల్లల నుంచి మాత్రం అలాంటివి ఆశించడం సాధారణంగా మారిపోయింది. పిల్లలకు కూడా తమ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందనే విషయాన్ని పెద్దలు గుర్తుంచుకోవాలి.
ప్రశంసకు.. ప్రదర్శనకు తేడా ఉంది
పిల్లల ప్రతిభ గురించి గర్వపడటంలో ఎలాంటి తప్పు లేదు. వారు సాధించిన విజయాలను ఇతరులతో పంచుకోవడం కూడా సహజమే. కానీ ప్రశంసించే స్థానం నుంచి ప్రదర్శించాలనే ఒత్తిడి మొదలైతే సమస్యలు వస్తాయి. అప్పుడు పిల్లలు తమ వ్యక్తిత్వం కంటే పరిపూర్ణంగా కనిపించడమే ముఖ్యమని భావించే ప్రమాదం ఉంటుంది.
చిన్న మార్పే చాలు
పిల్లలకు ఎంపిక ఇచ్చే అలవాటు చాలా ముఖ్యం. ‘‘రా.. డ్యాన్స్ చేసి చూపించు’’ అని చెప్పే బదులు ‘‘ఇష్టం ఉంటే అందరికీ డ్యాన్స్ చేసి చూపిస్తావా?’’ అని అడగాలి. లేదా ముందుగా వారితో విడిగా మాట్లాడి అభిప్రాయం తెలుసుకోవాలి. పిల్లలు వద్దంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. నిజమైన ఆత్మవిశ్వాసం బలవంతపు ప్రదర్శనలతో రాదు. తమ భావాలకు విలువ ఉందనే నమ్మకం కలిగినప్పుడే అది పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.