‘మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం’.. కిషన్‌ రెడ్డిపై భట్టి ఫైర్‌

Bhatti Vikramarka fires at Kishan Reddy saying we fought for Tadicherla 2 coal block
  • తాడిచెర్ల-2పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
  • కొత్త కేటాయింపు కాదన్న డిప్యూటీ సీఎం
  • 2013లోనే యూపీఏ సింగరేణికి కేటాయించిందని వెల్లడి
  • మైనింగ్‌ లీజు అనుమతులు ఆలస్యమయ్యాయని విమర్శ
  • అన్ని సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలని డిమాండ్‌
తెలంగాణలో తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ అంశం రాజకీయంగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వేలం లేకుండానే ఈ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇది కొత్త కేటాయింపు కాదని, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి అనుమతులు తెచ్చుకుందని పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. తాడిచెర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం సంతోషకరమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

తాడిచెర్ల-2 బొగ్గు గనిని 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని భట్టి తెలిపారు. అలాంటప్పుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించింది ఏంటని ప్రశ్నించారు. బ్లాక్‌ కేటాయించినప్పటికీ మైనింగ్‌ లీజుకు అవసరమైన అనుమతులు మాత్రం ఇవ్వలేదని చెప్పారు.

కొత్త చట్టం ప్రకారం తాడిచెర్ల-2ను సింగరేణికి ఇవ్వబోమని కేంద్రం చెప్పిందన్నారు. అయితే ఆ చట్టం అమల్లోకి రాకముందే ఈ బ్లాక్‌ సింగరేణికి కేటాయించిన విషయాన్ని తాము ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పోరాడటంతో చివరకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఇప్పటికైనా అనుమతులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే సింగరేణి పరిధిలో ఉన్న అన్ని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని భట్టి డిమాండ్‌ చేశారు. అదే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే నిర్ణయమవుతుందని అన్నారు.
Advertisement
Bhatti Vikramarka
Kishan Reddy
Tadicherla 2 coal block
Singareni SCCL
Telangana coal mines
Central Government vs Telangana

More Telugu News