వివరణ ఎందుకు ఇస్తా?: కొండా సురేఖ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి

Kadiyam Srihari reacts strongly to Konda Surekha complaint over official review meeting
  • తన దేవాదాయ శాఖలో శ్రీహరి సమీక్ష నిర్వహించారంటూ సురేఖ ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ ను కోరిన వైనం
  • తానెప్పుడూ ప్రోటోకాల్‌కు లోబడే పని చేస్తానన్న శ్రీహరి
  • అధికారులతో తాను సమీక్ష నిర్వహించలేదని వెల్లడి
  • ఆలయాల సమస్యల గురించి మాత్రమే అధికారులను కలిశానన్న శ్రీహరి
  • రాజకీయాల్లో కొందరు కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని విమర్శ

తనకు చెందిన దేవాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరిని వివరణ కోరాలని... విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని ఆమె కోరారు. సురేఖ చేసిన ఫిర్యాదుపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. "నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు" అని ఆయన తేల్చిచెప్పారు. తాను ఎప్పుడూ ప్రోటోకాల్‌కు లోబడే పనిచేస్తానని స్పష్టం చేసిన కడియం... ఇదంతా కేవలం అవగాహన లోపం వల్లనే జరుగుతోందని అన్నారు.


దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదనే విషయం ఒక ప్రజాప్రతినిధిగా తనకు తెలుసని కడియం శ్రీహరి అన్నారు. "నా నియోజకవర్గంలోని పలు ఆలయాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సంబంధిత శాఖ కమిషనర్, అధికారులు, ఆలయ చైర్మన్లను కలిశాను. అక్కడ ఎలాంటి అధికారిక సమీక్ష నిర్వహించలేదు. కేవలం క్షేత్రస్థాయి సమస్యలను మాత్రమే వారి దృష్టికి తీసుకెళ్లాను" అని వివరించారు. దేవాదాయ శాఖలో నిధులు లేవని చెప్పడంతో... ఆలయాల అభివృద్ధికి సంబంధించిన ఎస్టిమేషన్‌లను (అంచనాలను) మాత్రమే కోరినట్లు వెల్లడించారు.


ఈ వివాదంపై కొండా సురేఖను ఉద్దేశించి కడియం శ్రీహరి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "రాజకీయాల్లో కొందరు కొత్త అలవాట్లు నేర్చుకున్నారు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ... వార్తల్లో ఉంటూ ప్రజల మధ్య బతకాలని చూస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం తాను ఎవరినైనా కలుస్తానని... అవసరమైతే మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలిసి నిధులు సాధించుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement
Kadiyam Srihari
Konda Surekha
Revanth Reddy
Telangana Politics
Endowments Department
Station Ghanpur MLA

More Telugu News