ఇవి ఐపీఎల్‌ పిచ్‌లు కాదు.. భారత బ్యాటింగ్‌ వైఫల్యంపై ఆర్చర్‌ పరోక్ష వ్యాఖ్యలు!

Jofra Archer indirect comments on Indian batting failure says these are not IPL pitches
  • ఐపీఎల్‌ పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయన్న ఆర్చర్‌
  • ఇంగ్లండ్‌లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయన్న పేసర్‌ 
  • ఇంగ్లండ్‌లో బౌలింగ్‌ చేయడం సహజంగా ఉంటుందని వెల్లడి
  • అదే భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని పరోక్ష వ్యాఖ్యలు
  • భారత్‌లో పిచ్‌లు సులభంగా ఉంటాయన్న బౌలర్‌
  • బౌండరీలు దగ్గరగా ఉంటాయని వ్యాఖ్య
భారత్‌పై మూడో టీ20లో ఘన విజయం సాధించిన తర్వాత ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్‌లో ఉండే పిచ్‌లు బ్యాటర్లకు చాలా అనుకూలంగా ఉంటాయన్నాడు. ఇంగ్లండ్‌లో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పాడు. అదే భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆర్చర్‌ మూడు వికెట్లతో రాణించాడు. జోష్‌ టంగ్‌ నాలుగు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమిగా నమోదైంది.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ఆర్చర్‌.. ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేయడం కంటే ఇంగ్లండ్‌లో బౌలింగ్‌ చేయడం సహజంగా అనిపిస్తుందని చెప్పాడు. భారత్‌లో పిచ్‌లు చాలా సులభంగా ఉంటాయన్నాడు. బౌండరీలు కూడా చిన్నవిగా ఉండటంతో బౌలర్లు ఎంతో కచ్చితంగా బంతులు వేయాల్సి వస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్‌లో మాత్రం మంచి లెంగ్త్‌లో నేరుగా బంతులు వేస్తే సరిపోతుందని వివరించాడు. పొరపాటుకు కొంత అవకాశం ఉంటుందని తెలిపాడు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌పై 200కుపైగా లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని ఆర్చర్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అయితే 200 పరుగులు కూడా చాలాసార్లు సరిపోవని గుర్తు చేశాడు. తమ బౌలర్లంతా వికెట్లు తీయడంతో పూర్తి స్థాయి జట్టు ప్రదర్శన కనిపించిందని చెప్పాడు.

భారత బ్యాటర్లు వేగానికి ఇబ్బంది పడ్డారా అన్న ప్రశ్నకు ఆర్చర్‌ భిన్నంగా స్పందించాడు. తమ విజయానికి కేవలం వేగమే కారణం కాదని స్పష్టం చేశాడు. తాము అనుకున్న ప్రణాళికను కచ్చితంగా అమలు చేశామని చెప్పాడు. మాంచెస్టర్‌లో కూడా బాగా బౌలింగ్‌ చేశామని, అప్పట్లో వికెట్లు రాలేదని గుర్తు చేశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో గాలి ప్రభావం కూడా ఉండటంతో బంతులు మరింత వేగంగా కనిపించి ఉండొచ్చని అన్నాడు.

ఈ సిరీస్‌లో మరో ఆసక్తికర పోటీ వైభవ్‌ సూర్యవంశీ, ఆర్చర్‌ మధ్య సాగుతోంది. మాంచెస్టర్‌లో తొలి బంతికే ఆర్చర్‌పై సిక్స్‌ కొట్టిన వైభవ్‌.. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో మాత్రం 145 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బౌన్సర్‌కు ఔటయ్యాడు. దీనిపై స్పందించిన ఆర్చర్‌.. ‘‘ఇప్పుడు ఇద్దరం సమానమే. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. చివరికి ఎవరు మెరుగ్గా రాణిస్తారో చూద్దాం’’ అని నవ్వుతూ చెప్పాడు.

నాలుగో టీ20 గురువారం బ్రిస్టల్‌లో జరగనుంది. చివరి మ్యాచ్‌ శనివారం సౌతాంప్టన్‌లో నిర్వహించనున్నారు.
Advertisement
Jofra Archer
India vs England T20
IPL vs England pitches
Vaibhav Suryavanshi
Trent Bridge T20 match
India batting failure

More Telugu News