తెలంగాణ విఫలం కాలేదు.. సఫలమై నిలిచింది: ప్రపంచ బ్యాంకు నివేదికపై కేటీఆర్ ఆనందం

KTR credits KCR vision for Telangana top 5 rank in World Bank report
  • తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం అంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక
  • ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్
  • కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని వ్యాఖ్య
  • తెలంగాణ ప్రజలు బికారులు కాదన్న కేటీఆర్
  • విమర్శలు చేసే వారికి వరల్డ్ బ్యాంక్ నివేదికే సమాధానమని వ్యాఖ్య

'తెలంగాణ దివాలా తీసింది' అంటూ దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు గట్టి కౌంటర్ పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచ బ్యాంకు' ఇచ్చిన తాజా నివేదికలో... తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం అంటూ పేర్కొనడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే ఈ ఘనత సాధించిన టాప్-5 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ నిలవడం మనకందరికీ గర్వకారణమంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్షంగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ దార్శనిక పాలన వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల కిందట వరకు దరిద్రం తాండవించిన ప్రాంతం కాస్తా... నేడు ధనిక రాష్ట్రంగా మారిందని అన్నారు. తెలంగాణ ప్రజలు బికారులు కాదని, సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలని వ్యాఖ్యానించారు. తమ చెమటను, నైపుణ్యాన్ని, మేధస్సును ధారపోసి తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికీ ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు.


"తెలంగాణ వస్తే ఏం పెరిగింది అని అడిగేవారు చూడాలి. ఇక్కడ జాతి సంపద పెరిగింది, జనం ఆదాయం అద్భుతంగా వృద్ధి చెందింది" అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా ముందుకు దూసుకెళ్లిందని కేవలం జాతీయ నివేదికలే కాదు, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సంస్థలే స్టాంప్ వేసి చెబుతున్నాయన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రతిదానికీ 'దివాలా.. దివాలా' అంటూ మైకుల ముందు అరిచే వాళ్ల నోళ్లు మూయించడానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఈ తాజా నివేదికే ఒక పవర్ ఫుల్ సమాధానమని పేర్కొన్నారు.

Advertisement
KTR
Telangana
World Bank Report
KCR
Upper Middle Income State
BRS Party

More Telugu News