ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్‌ పర్యటన సక్సెస్

Nara Lokesh South Korea visit success as Boo Young Group eyes footwear investment in Andhra Pradesh
  • దక్షిణ కొరియాలో పాదరక్షల తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్‌తో మంత్రి భేటీ
  • ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కంపెనీకి లోకేశ్‌ ఆహ్వానం
  • పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసిన బూ యంగ్ గ్రూప్
  • రెడీ బిల్ట్ షెడ్లు అందుబాటులో ఉంటే కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడి
  • రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు ఉన్నాయని లోకేశ్‌ హామీ
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న పర్యటనలో కీలక ముందడుగు పడింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాదరక్షలు, వాటి అనుబంధ పరికరాల తయారీ సంస్థ 'బూ యంగ్ గ్రూప్' (Boo Young Group) యాజమాన్యంతో ఆయన జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు బూ యంగ్ గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది.

బుసాన్‌లో బూ యంగ్ గ్రూప్ సీఈవో & ప్రెసిడెంట్ ర్యాన్ కాంగ్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కంపెనీని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని లోకేశ్‌ వివరించారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా 'రెడీ బిల్ట్ షెడ్ల' కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థ స్కైకార్ప్ గ్రూప్‌లో భాగమని, ప్రపంచవ్యాప్తంగా 4,300 మంది కస్టమర్లు, 1.10 లక్షలకు పైగా అంతర్జాతీయ షిప్‌మెంట్లు నిర్వహించేంత పెద్ద నెట్‌వర్క్ తమకు ఉందని వివరించారు. తమకున్న గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో సులభంగా అనుసంధానించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశం విజయవంతం కావడంతో బూ యంగ్ గ్రూప్ ప్రతినిధులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి, రెడీ బిల్ట్ షెడ్ల లభ్యతను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెట్టుబడి కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో తయారీ రంగానికి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement
Nara Lokesh
Boo Young Group
Andhra Pradesh Investment
South Korea Visit
Footwear Manufacturing Industry
Ryan Kang

More Telugu News