పర్యాటక రంగంలో ఏపీ నయా హిస్టరీ.. 'నివు ఏఐ' పార్ట్‌నర్‌షిప్‌తో పాటు విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్స్!
- డిజిటల్ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- టూరిస్టులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించడమే లక్ష్యం
- విజయవాడ నుంచి కాశీ, కోల్‌కతాకు సరికొత్త విమాన సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకం మొదలైంది. ఏపీని దేశంలోనే మొట్టమొదటి 'ఏఐ' (AI) ఆధారిత టూరిజం స్టేట్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రముఖ డిజిటల్ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్' తీసుకొచ్చిన ‘నివు ఏఐ’ (Nivu AI) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకునేందుకు ఏపీ టూరిజం అథారిటీ (APTA) మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమక్షంలో ఉన్నతాధికారులు ఈ డీల్‌పై సంతకాలు చేశారు. టూరిస్టులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు.
ఇక విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు, భక్తులకు మంత్రి కందుల దుర్గేశ్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆధ్యాత్మిక నగరమైన వారణాసి (కాశీ)తో పాటు చారిత్రక నగరమైన కోల్‌కతాకు సరికొత్త విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' ఆధ్వర్యంలో రాబోయే ఆగస్టు 13 నుంచి ఈ కొత్త సర్వీసులు నడవనున్నాయి. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారాలు) ఈ విమానాలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు, కాశీ విశ్వనాథుడిని దర్శించుకునే భక్తులు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.