వర్షం లేదా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి గొడుగు పట్టుకోవడం చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా చేతిలో వస్తువులు ఉన్నప్పుడు గొడుగును పట్టుకోవడం మరింత కష్టతరం. ఈ సమస్యకు పరిష్కారంగా కెనడాకు చెందిన ఓ ఇంజనీర్ ఒక వినూత్న ఆవిష్కరణను తెరపైకి తెచ్చారు. చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా, గాలిలో డ్రోన్‌లా తేలుతూ వినియోగదారుడిని అనుసరించే ఒక ప్రత్యేక గొడుగును ఆయన రూపొందించారు. జాన్ త్సే అనే ఇంజనీర్ ఆవిష్కరించిన ఈ 'అటానమస్ ఫ్లయింగ్ అంబ్రెల్లా' వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మరోసారి వైరల్‌గా మారింది.

'ఐ బిల్డ్ స్టఫ్' అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడైన జాన్ త్సే, గతంలో రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే గొడుగును రూపొందించారు. దానికి వచ్చిన స్పందన ఆధారంగా, దానిని మరింత మెరుగుపరిచి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తితో పనిచేసేలా తీర్చిదిద్దారు. దీని తయారీ కోసం ఆయన సుమారు రెండేళ్లు పాటు శ్రమించారు. ఈ అత్యాధునిక గొడుగు వినియోగదారుడి తలను గుర్తించి, వారు ఎటు వెళితే అటు గాలిలో ఎగురుతూ అనుసరించడం దీని ప్రధాన ప్రత్యేకత.

ఈ ఫ్లయింగ్ అంబ్రెల్లా తయారీలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. నాలుగు ప్రొపెల్లర్లు, 3డీ ప్రింటెడ్ భాగాలు, కార్బన్-ఫైబర్ నైలాన్ పరికరాలతో దీనిని సిద్ధం చేశారు. ఇందులో అమర్చిన టైమ్-ఆఫ్-ఫ్లైట్ డెప్త్ కెమెరా, రాస్ప్‌బెర్రీ పై సాంకేతికత సహాయంతో వినియోగదారుడి కదలికలను ఇది ట్రాక్ చేస్తుంది. తక్కువ కాంతి ఉన్నప్పటికీ ఇది అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుంది. అయితే, దీని బ్యాటరీ సామర్థ్యం ప్రస్తుతం 10-15 నిమిషాలకే పరిమితమని, బలమైన గాలులను తట్టుకోవడం దీనికి కొంత కష్టమని జాన్ త్సే వివరించారు.

ఈ వినూత్న ఆవిష్కరణపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు, నడవడానికి ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కొనియాడుతున్నారు. అయితే, ఇది ప్రస్తుతం కేవలం ఒక ప్రయోగాత్మక ప్రాజెక్ట్ మాత్రమేనని, వాణిజ్యపరంగా మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో లేదని జాన్ త్సే స్పష్టం చేశారు.
Play video