ఈ చెడు అలవాట్లతో శరీరం కంటే వేగంగా వృద్ధాప్యంలోకి మెదడు!

Brain health declines faster than body due to bad habits
  • ఒత్తిడి, నిద్రలేమి ప్రధాన కారణాలు
  • ప్రాసెస్డ్‌ ఆహారం, ఒంటరితనం కూడా ప్రమాదకరం
  • మంచి నిద్ర, వ్యాయామం మెదడుకు మేలు
  • కొత్త విషయాలు నేర్చుకోవడం మెదడును చురుగ్గా ఉంచుతుంది
వృద్ధాప్యం అంటే చాలామంది తెల్ల జుట్టు, ముడతలు, శారీరక మార్పులనే అనుకుంటారు. కానీ శరీరం యవ్వనంగా కనిపించినా, మెదడు మాత్రం అంతకంటే వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారీ జీవనశైలిలోని కొన్ని చెడు అలవాట్లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం.. పుట్టిన తేదీ ప్రకారం ఉన్న వయసు కంటే మెదడు జీవశాస్త్రీయ వయసు (బయోలాజికల్‌ ఏజ్‌) ఎక్కువగా ఉండొచ్చు. దీన్నే బ్రెయిన్‌ ఏజ్‌ గ్యాప్‌ అంటారు. ఇది పెరిగితే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి క్షీణించడం, అల్జీమర్స్‌, స్ట్రోక్‌ వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది.

దాదాపు 40 వేల మంది బ్రెయిన్‌ స్కాన్‌లపై జరిగిన పరిశోధనల్లో మెదడు వయసు ప్రతి ఏడాది పెరిగిన కొద్దీ అల్జీమర్స్‌ ప్రమాదం సుమారు 16.5 శాతం, మరణ ముప్పు దాదాపు 12 శాతం పెరుగుతుందని గుర్తించారు. ముఖ్యంగా మెదడు ఏజ్‌ నిజమైన వయసు కంటే 2.5 సంవత్సరాలు ఎక్కువైతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, స్పందన వేగం మరింత తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మెదడు వేగంగా వృద్ధాప్యానికి గురికావడానికి దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రాసెస్డ్‌ ఆహారం ఎక్కువగా తినడం, ఒంటరిగా జీవించడం వంటి అలవాట్లు ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోక్యాంపస్‌పై ప్రభావం చూపుతుంది. అలాగే మెదడు కణాల పునరుద్ధరణను నిద్రలేమి దెబ్బతీస్తుంది.

అయితే మెదడు వృద్ధాప్యాన్ని కొంతవరకు నెమ్మదింపజేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ నడక లేదా వ్యాయామం చేయడం, సరిగా నిద్రపోవడం, పుస్తకాలు చదవడం, పజిల్స్‌ పరిష్కరించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సన్నిహితంగా ఉండడం వంటి అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని సూచిస్తున్నారు.
Brain Health
Brain Aging
Alzheimers Risk
Memory Loss
Brain Age Gap
Healthy Lifestyle

More Telugu News