తృణమూల్ పేరు, గుర్తు ఎవరివి?.. నేటితో ముగియనున్న ఈసీ గడువు.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ

Mamata Banerjee Trinamool name and symbol dispute ECI deadline ends today
  • ఈసీఐకి పత్రాల సమర్పణ గడువు నేటితో ముగింపు
  • మమతా బెనర్జీ వర్గం వర్సెస్ రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు వర్గం
  • శాసనసభ, జాతీయ కమిటీల్లో మెజారిటీ ఉందంటున్న రెబెల్స్ 
  • 2022లో జీవితకాల అధ్యక్షురాలిగా మమత ఎన్నికను గుర్తుచేసిన విధేయులు
  • పార్టీ నిధులు, గుర్తు కోసం తీవ్రస్థాయికి చేరిన పోరు
పశ్చిమ బెంగాల్ అధికార పీఠాన్ని కోల్పోయిన తర్వాత తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఉనికి పోరాటం ఇప్పుడు తుది అంకానికి చేరింది. పార్టీ పేరు, అధికారిక "జోడు పువ్వులు-గడ్డి" గుర్తు, పార్టీ నిధులపై హక్కుల కోసం పోటీ పడుతున్న రెండు ప్రత్యర్థి వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) విధించిన గడువు సోమవారం (జులై 6) సాయంత్రం 5:30 గంటలతో ముగియనుంది. 

మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని అధికారిక వర్గం ఒకవైపు.. పార్టీ నుంచి బహిష్కరణకు గురై, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు (మెజారిటీ) వర్గం మరోవైపు తమ వాదనలకు సంబంధించిన కీలక పత్రాలను ఈసీఐకి సమర్పించాయి. దీంతో ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పడింది.  

రెండు వర్గాలు ఈసీఐ ముందు బలమైన వాదనలను వినిపించాయి. తిరుగుబాటు వర్గ నేత రితాబ్రతా బెనర్జీ తనకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్షంలోనూ, గత నెలలో తాము కొత్తగా ఏర్పాటు చేసిన 'నేషనల్ వర్కింగ్ కమిటీ'లోనూ స్పష్టమైన సంఖ్యా బలం (మెజారిటీ) ఉందని వాదిస్తున్నారు. ఈ రెబెల్ వర్గం మమతా బెనర్జీ స్థానంలో సీనియర్ నాయకుడు అరూప్ రాయ్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించుకుంది.

మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని మైనారిటీ వర్గం ప్రధానంగా రెండు వాదనలను తెరపైకి తెచ్చింది. మొదటిది, రితాబ్రత సహా తిరుగుబాటు క్యాంపులోని ఎమ్మెల్యేలందరూ మమతా బెనర్జీ జారీ చేసిన బీ-ఫామ్స్, తృణమూల్ గుర్తుపైనే పోటీ చేసి గెలిచారని, కాబట్టి వారు పార్టీ గుర్తుపై హక్కులు కోరలేరని పేర్కొంది. రెండవది, కేవలం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఏర్పాటు చేసిన కొత్త కమిటీ చెల్లదని, 2022 ఫిబ్రవరిలో దేశవ్యాప్త ప్రతినిధులతో జరిగిన ప్లీనరీలో మమతా బెనర్జీని జీవితకాల జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారని, కాబట్టి పార్టీ గుర్తు తమకే చెందుతుందని విధేయులు వాదిస్తున్నారు.

ఈ రాజకీయ యుద్ధం మధ్య మమతా బెనర్జీ శనివారం సోషల్ మీడియా వేదికగా లైవ్ వీడియోలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తిరుగుబాటు వర్గం లక్ష్యం కేవలం పార్టీ పేరు, గుర్తు, నిధులను లాక్కోవడమేనని ఆరోపించారు. "ఎన్నికల సంఘం దయ వల్ల చివరికి మీరు గుర్తును సాధించుకున్నా నేను భయపడను. సాధారణ ప్రజలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎవరిని అంగీకరిస్తారనేదే ముఖ్యం. నేను మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల్లో పోటీ చేశాను. అవసరమైతే ఇప్పుడు ఆ గుర్తును నా మెడలో వేలాడదీసుకుని ప్రజల్లోకి వెళ్తాను. నా గొంతును మీరు నొక్కలేరు.. నన్ను చంపితేనే నా గొంతు మూయించగలరు" అని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  
Mamata Banerjee
Trinamool Congress
Election Commission of India
West Bengal politics
TMC symbol dispute
Ritabrata Banerjee

More Telugu News