ఏపీలో మైక్రో ఎల్ఈడీ హబ్.. కొరియా సంస్థకు మంత్రి లోకేశ్‌ ప్రతిపాదన

Nara Lokesh proposes Micro LED Hub in AP to South Korean firm Soft-Epi
  • కొరియా పర్యటనలో సాఫ్ట్-ఈపీఐ సంస్థ సీఈవోతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • తిరుపతి ఐఐటీ సహకారంతో ప్రత్యేక శిక్షణా అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన
  • ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలని సూచన
  • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న సాఫ్ట్-ఈపీఐ యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, డిస్‌ప్లే తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌, సియోల్‌లో ప్రముఖ సెమీకండక్టర్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సంస్థను ఆహ్వానించారు.

సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే తయారీ పరిశ్రమకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. భారత్‌లోని ఇతర కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్‌ను స్థాపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని లోకేశ్‌ పేర్కొన్నారు.

అంతేగాక రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ మంత్రి లోకేశ్‌ మరో కీలక ప్రతిపాదనను వారి ముందుంచారు. తిరుపతి ఐఐటీ సహకారంతో రాష్ట్రంలో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్‌ను నెలకొల్పాలని సూచించారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో 'సాఫ్ట్-ఈపీఐ అకాడమీ'ని ఏర్పాటు చేసి GaN ఎపిటాక్సీ, ఎంఓసీవీడీ, మైక్రో ఎల్ఈడీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ఏటా 500 మంది స్థానిక టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు.

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ దక్షిణ కొరియా కేంద్రంగా GaN ఎపివేఫర్లు, మైక్రో-ఎల్ఈడీ ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో తమకు ప్రత్యక్ష తయారీ కార్యకలాపాలు లేవని, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచిన ఆకర్షణీయమైన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్ ప్రణాళికపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ భేటీతో ఏపీకి మరో భారీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడిని ఆకర్షించే దిశగా కీలక ముందడుగు పడినట్లయింది.

Nara Lokesh
Soft-Epi
Micro LED Hub
Andhra Pradesh
South Korea
Electronics Manufacturing

More Telugu News