ఖమేనీ అంత్యక్రియల కోసం.. లండన్ నుంచి వచ్చి ట్రంప్‌పై విరుచుకుపడిన ఇరానియన్ మహిళ!
- గ్రాండ్ మొసల్లాకు పోటెత్తిన జనసందోహం
- ఖమేనీ అంత్యక్రియల కోసం 4 వేల కి.మీ. ప్రయాణం
- యుద్ధం తమను మరింత బలంగా మార్చిందన్న మహిళ
- తమ నాగరికతను ఎవరూ నాశనం చేయలేరని వ్యాఖ్య
- మీనాబ్ స్కూల్ విషాదాన్ని తాము ఒక్క రోజు కూడా మరచిపోలేదన్న మహిళ
అయితే, ఈ శోకసంద్రం మధ్య మరో హృదయవిదారక దృశ్యం కూడా ఇరాన్ ప్రజలను వెంటాడుతోంది. యుద్ధ సమయంలో మీనాబ్‌లోని బాలికల పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో మరణించిన 150 మందికి పైగా చిన్నారుల ఫోటోలను రాజధాని వీధుల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ సుదీర్ఘ యుద్ధం మిగిల్చిన గాయాలను ఆ ఫోటోలు గుర్తుచేస్తున్నాయి.
ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) నుంచి ప్రత్యేకంగా విమానంలో టెహ్రాన్ చేరుకున్న మాజియా అనే ప్రవాస ఇరానియన్ మహిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
"4,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక నాగరికతను ఎవరూ నాశనం చేయలేరని ప్రపంచానికి చాటి చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇరాన్‌ను నాశనం చేయాలనుకునే వారు వాస్తవానికి వారి సొంత దేశాన్నే నాశనం చేసుకుంటున్నారు" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యుద్ధ సమయంలో ఇరాన్ నాగరికత అంతమైపోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈ యుద్ధం ఇరాన్‌ను మరింత బలోపేతం చేసిందని, ప్రజలను ఐక్యం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు.
వేరే దేశాల వనరులను దోచుకునే పాశ్చాత్య దేశాల జోక్యానికి వ్యతిరేకంగా తాము బలంగా నిలబడాలని, ఇందుకు వెనిజువెలానే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. అమెరికా మోడల్ ప్రజాస్వామ్యాన్ని తాము నమ్మడం లేదని.. సిరియా, ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్థాన్‌లకు వారు ఇచ్చిన ప్రజాస్వామ్యం తమకు వద్దన్నారు. మీనాబ్ స్కూల్ విషాదాన్ని తాము ఒక్క రోజు కూడా మరచిపోలేదని చెబుతూ.. అమాయక పిల్లల ప్రాణాలను బలిగొనే ఇటువంటి యుద్ధాలకు అమెరికా పౌరుల పన్ను డబ్బులే ఎలా నిధులుగా మారుతున్నాయో అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇక గ్రాండ్ మొసల్లా లోపల ఖమేనీ శవపేటిక పక్కన ఉంచిన ఆయన చిన్న మనవరాలి ఫోటోను చూసి నిరసనకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. టెహ్రాన్‌లో నివాళులు ముగిసిన అనంతరం ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సోమవారం కోమ్ నగరానికి, అక్కడి నుంచి ఇరాక్‌లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు చేరుకుంటుంది. చివరిగా జులై 9న ఖమేనీ జన్మస్థలమైన మషాద్‌లో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.