సీఈఓను ఒక్క ప్రశ్న అడిగాడు.. చేతికి వచ్చిన జాబ్‌ జారిపోయింది!

Karan Gogna lost job offer after asking CEO one question during interview
  • కరణ్‌ గొగ్నా లింక్డిన్‌ పోస్ట్‌ వైరల్‌
  • చివరి ఇంటర్వ్యూలో సీఈఓకు ప్రశ్న
  • సీఈఓ ఎదురు ప్రశ్నతో తడబాటు
  • ఉద్యోగంలోకి తీసుకోలేదంటూ మరుసటి రోజు అందిన సమాచారం
  • అడగాలనుకున్న ప్రశ్నలకూ సమాధానం సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కరణ్‌ సూచన
ఇంటర్వ్యూలో దాదాపు అన్ని రౌండ్లు పూర్తి చేశాడు. హెచ్‌ఆర్‌ అవసరమైన పత్రాలు కూడా తీసుకుంది. ఇక ఆఫర్‌ లెటర్‌ వస్తుందని భావించాడు. కానీ చివర్లో సీఈఓను అడిగిన ఒక్క ప్రశ్న అతనికి ఉద్యోగాన్ని దూరం చేసిందని కెనడాలోని భారతీయ ప్రొడక్ట్‌ మేనేజర్‌ కరణ్‌ గొగ్నా వెల్లడించాడు. ఈ అనుభవాన్ని లింక్డిన్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది.

సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వ్యాపారం చేసే ఓ స్టార్టప్‌లో కరణ్‌ గొగ్నా ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ని దశలు విజయవంతంగా పూర్తి కావడంతో నియామకం ఖాయమని భావించాడు. అయితే ఆఫర్‌కు ముందు కంపెనీ సీఈఓతో చివరి సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశం ముగిసే సమయంలో ‘‘మీకు ఏమైనా సందేహాలున్నాయా?’’ అని సీఈఓ అడిగారు. దానికి కరణ్‌.. ‘‘మీ కంపెనీ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకీ రావాలనుకుంటుందా?’’ అని ప్రశ్నించాడు. అయితే సీఈఓ నేరుగా సమాధానం చెప్పకుండా.. ‘‘మీ అభిప్రాయం ఏంటి? మేం ఆ మార్కెట్‌లోకి వెళ్లాలా?’’ అని ఎదురుప్రశ్న వేశారు.

ఫోర్‌ వీలర్‌ మార్కెట్‌పై బాగా సిద్ధమైనప్పటికీ.. ద్విచక్ర వాహనాల రంగంపై తాను ఎలాంటి విశ్లేషణ సిద్ధం చేసుకోలేదని కరణ్‌ తెలిపాడు. దీంతో సరైన సమాధానం చెప్పలేక తడబడ్డానని పేర్కొన్నాడు.

మరుసటి రోజే హెచ్‌ఆర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. మరో అభ్యర్థిని ఎంపిక చేసినట్లు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఇంటర్వ్యూలో సమాధానాలకే కాదు, మనం అడిగే ప్రశ్నలకూ సమానంగా సిద్ధం కావాలని కరణ్‌ సూచించాడు. ఎందుకంటే ఆ ప్రశ్నల ద్వారానే అభ్యర్థి ఆలోచనా విధానాన్ని ఇంటర్వ్యూవర్లు అంచనా వేస్తారని చెప్పాడు.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు కరణ్‌ అభిప్రాయంతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ప్రశ్న వల్ల ఉద్యోగం పోలేదని, ఊహించని పరిస్థితిలో ఎలా స్పందిస్తాడో తెలుసుకోవడానికే సీఈఓ ఎదురుప్రశ్న వేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.
Karan Gogna
Job interview rejection
LinkedIn viral post
Product Manager interview
CEO interview question
Startup job tips

More Telugu News