కరీంనగర్‌లో షాకింగ్ క్రైమ్.. రాపిడో బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్.. చాకచక్యంగా ప్రాణాలు దక్కించుకున్న మహిళ!

Shocking crime in Karimnagar kidnapping on Rapido bike woman narrowly escapes
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల రూ.4 లక్షల అప్పు
  • ఒంటరి మహిళపై దాడి, బంగారం దోపిడీ
  • సాక్ష్యం లేకుండా చేసేందుకు బావిలోకి తోసివేత
  • రాత్రంతా బావిలోనే ఈదుతూ ప్రాణాలతో పోరాటం
  • సీసీటీవీ, టెక్నికల్ ఆధారాలతో నిందితుడి అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌ల ఉచ్చులో పడి అప్పులపాలైన ఒక డిగ్రీ విద్యార్థి.. వాటిని తీర్చడం కోసం ఏకంగా కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నానికి ఒడిగట్టిన ఘోర ఉదంతం కరీంనగర్‌లో వెలుగుచూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన ధమ్మ దినేష్ రెడ్డి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థి, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు రూ.4 లక్షలు నష్టపోయాడు. వీటికి తోడు పలు లోన్ యాప్‌ల ద్వారా కూడా అప్పులు చేయడంతో రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ క్రమంలోనే అప్పులు తీర్చేందుకు అతడు ఒక క్రిమినల్ స్కెచ్ వేశాడు.

జులై 1న గంగాధర లక్ష్మి (55) అనే దినసరి కూలీ అదృశ్యమవడంతో తొలుత ఇది మిస్సింగ్ కేసుగా నమోదైంది. కానీ పోలీసుల విచారణలో ఇది ఒక భయంకరమైన కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నంగా తేలింది. నిందితుడు దినేష్ కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి లక్ష్మిని టార్గెట్‌గా ఎంచుకున్నాడు. జులై 1న ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నమ్మించి, రాపిడో బైక్ బుక్ చేసి తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను తన సొంత బైక్‌పై ఎక్కించుకుని నుస్తులాపూర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి దాడి చేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మెట్టెలను దోచుకున్నాడు.

ఆపై ఈ నేరానికి ఎలాంటి సాక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో లక్ష్మిని అక్కడే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోతుందని భావించాడు. అయితే, ఆమె బావిలోని ఒక తాడును పట్టుకోగా.. నిందితుడు ఆ తాడును కూడా బ్లేడుతో కోసేశాడు. ఆమె బతికే అవకాశం లేదని నమ్మి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ, బాధితురాలికి ఈత రావడంతో ఆమె బావిలోని మోటార్ పైప్‌లైన్‌కు కట్టిన మరో తాడును పట్టుకుని రాత్రంతా ప్రాణాలతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఆమె అరుపులు విని, తాళ్లు, మంచం సహాయంతో రక్షించి కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని మార్కెట్ పరిసరాల్లో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి బాధితురాలి మొబైల్ ఫోన్లు, బైక్, రూ. 5,000 నగదు, వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారాన్ని ఒక జ్యువెలరీ షాపులో విక్రయించగా, పోలీసులు దానిని కూడా రికవరీ చేశారు. ఈ కేసులో త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. 
Dhamma Dinesh Reddy
Karimnagar kidnapping crime
Online betting debt robbery
Rapido bike kidnap case
Loan app harassment murder attempt
Karimnagar woman survival story

More Telugu News