116 ఏళ్ల బామ్మ అచంచల భక్తి.. వెతికి మరీ వీఐపీ దర్శనం కల్పించిన టీటీడీ
- 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమల వెళ్లిన బామ్మ
- వీడియో వైరల్ కావడంతో స్పందించిన సీఎం, టీటీడీ ఛైర్మన్
- తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించిన అధికారులు
- కుటుంబంతో సహా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
- భక్తికి వయసు అడ్డంకి కాదంటూ చంద్రబాబు ప్రశంస
అలిపిరి నడక మార్గంలో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న నవనీతమ్మను చూసి ఓ భక్తురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ వయసులోనూ ఆమెకున్న భక్తిశ్రద్ధలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె వివరాలు తెలిస్తే, తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతూ, ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.
ఆయన విజ్ఞప్తి మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, ఆ భక్తురాలిని గుర్తించారు. ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల నివాసంలో ఉన్నారని కనుగొన్నారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, విజిలెన్స్ సిబ్బందిని అభినందించారు. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం నవనీతమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీవారి అనుగ్రహంతో ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
స్పందించిన సీఎం చంద్రబాబు
ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. నవనీతమ్మ వీడియోను ట్వీట్ చేస్తూ.. "నిష్కల్మషమైన భక్తికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. 116 ఏళ్ల బామ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం కాలినడకన తిరుమల వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాను. ఆమె విశ్వాసానికి కుటుంబం మద్దతుగా నిలవడం అద్భుతం. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం" అని పేర్కొన్నారు.
మొదట ఈ బామ్మ కర్ణాటకకు చెందినవారని ప్రచారం జరిగినా, టీటీడీ అధికారుల చొరవతో అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఒక సామాన్య భక్తురాలు తీసిన వీడియోతో మొదలైన ఈ ఘటన, ఉన్నతాధికారుల స్పందనతో నవనీతమ్మకు స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.