వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నేమార్ రిటైర్మెంట్!

Brazil out of World Cup Neymar retirement from international football with tears
  • అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నేమార్ రిటైర్మెంట్
  • రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్ ఓటమి
  • నార్వే చేతిలో 2-1తో పరాజయం
  • బ్రెజిల్ తరఫున గరిష్ఠంగా 80 గోల్స్
  • కన్నీళ్లతో ముగిసిన 16 ఏళ్ల ప్రయాణం
న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే చేతిలో బ్రెజిల్ 2-1 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దారుణ ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నేమార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల నేమార్ భావోద్వేగానికి గురవుతూ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 'సెలెకావో' (బ్రెజిల్ జట్టు)తో తన ప్రయాణం ముగిసిందని స్పష్టం చేశాడు.

ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో నార్వే ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. స్టాపేజ్ టైమ్‌లో నేమార్ పెనాల్టీని గోల్‌గా మలిచినప్పటికీ బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం నేమార్ మాట్లాడుతూ.. "నేను ఎంతో ప్రయత్నించాను, కానీ ఇక అంతా ముగిసింది. నేను ఇక్కడే ప్రారంభించాను, ఇక్కడే ముగించాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

గాయంతోనే వరల్డ్ కప్‌‌కు వచ్చిన నేమార్.. ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోచ్ కార్లో అన్సెలొట్టి వ్యూహాల్లో భాగంగా స్కాలాండ్, నార్వే మ్యాచ్‌లలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. బ్రెజిల్ జెర్సీలో పెనాల్టీ రూపంలో అతడు చేసిన చివరి గోల్ కేవలం ఓదార్పుగానే మిగిలిపోయింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2010లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నేమార్.. బ్రెజిల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 129 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 80 గోల్స్ సాధించాడు. నాలుగు ఫిఫా వరల్డ్ కప్‌లలో బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు ఫేస్ ఐకాన్‌గా నిలిచినప్పటికీ, ప్రపంచకప్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే, 2013లో ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, 2016 రియో ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా బ్రెజిల్‌కు బంగారు పతకం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం అందించాడు. కెరీర్ అంతటా గాయాలు వేధించినా, అంచనాల భారం వెంటాడినా బ్రెజిల్ అత్యుత్తమ ఫుట్‌బాలర్లలో ఒకడిగా నేమార్ నిలిచిపోతాడు. మ్యాచ్ ముగిశాక మైదానంలో నేమార్ కన్నీళ్లు పెట్టుకోగా.. సహచర ఆటగాళ్లు అతడిని ఓదార్చారు. ఈ ఓటమితో కోచ్ కార్లో అన్సెలొట్టి ఆధ్వర్యంలోని బ్రెజిల్ వరల్డ్ కప్ ప్రస్థానం కూడా ముగిసింది.
Neymar
Brazil football
FIFA World Cup
Erling Haaland
Neymar retirement
Norway football

More Telugu News