కిడ్నాపర్ల నుంచి మహిళను రక్షించబోయిన పాక్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కాల్చివేత

Pakistan Air Force officer shot dead while trying to save woman from kidnappers
  • ఇస్లామాబాద్ షాహీన్ చౌక్ వద్ద ఘోరం
  • మహిళ కిడ్నాప్‌కు యత్నం భగ్నం
  • గ్రూప్ కెప్టెన్ అసిమ్ హత్య
  • హై-సెక్యూరిటీ జోన్‌లో కలకలం 
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కలకలం రేగుతోంది. ఒక మహిళను అపహరించేందుకు జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకుని, ఆమెను కాపాడబోయిన పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ దుండగుడి చేతిలో కాల్చివేతకు గురయ్యారు. జులై 5న పాక్ ఎయిర్ హెడ్‌క్వార్టర్స్, ఎయిర్ యూనివర్సిటీకి అత్యంత సమీపంలో ఉన్న షాహీన్ చౌక్ వద్ద జరిగిందీ దారుణం.

పాక్ ఎయిర్‌ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా, ఒక మహిళ మోటార్ సైకిల్‌పై ఉన్న వ్యక్తితో గొడవ పడటం గమనించారు. ఆ మహిళ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు గ్రహించిన అధికారి వెంటనే వారి వద్దకు వెళ్లి నిందితుడిని నిలదీశారు. మోటార్ సైకిల్‌పై ఉన్న వ్యక్తి ఆ మహిళను బలవంతంగా అపహరించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అధికారికి, నిందితుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీ తీసి గ్రూప్ కెప్టెన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రమైన బుల్లెట్ గాయాలవడంతో అసిమ్ తారిఖ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధిత మహిళ తర్వాత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితుడు తనకు తెలిసినవాడేనని, తనతో పాటే ఒకే ఆఫీసులో పనిచేసే కొలీగ్ అని తెలిపింది. ఆఫీస్ పని ముగిసిన తర్వాత అతడు లిఫ్ట్ ఇస్తానంటే బైక్ ఎక్కానని, అయితే తన ప్రమేయం లేకుండానే దారి మార్చి జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లాడని వివరించింది. కాల్పుల అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే నిందితుడు తప్పించుకున్నాడు. ఇస్లామాబాద్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వీఐపీ జోన్ పరిధిలో ఈ హత్య జరగడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Asim Tariq
Pakistan Air Force
Islamabad shooting
Group Captain Asim Tariq
PAF officer killed
Pakistan news

More Telugu News