వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగించండి... నీరు అందించి చూపిస్తాం: కేటీఆర్

Hand over project to KCR for a week we will provide water says KTR
  • కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేటీఆర్ బృందం
  • పర్యటనను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం, చోటుచేసుకున్న ఉద్రిక్తత
  • లక్ష క్యూసెక్కుల గోదావరి నీటిని ప్రభుత్వం వృథా చేస్తోందని కేటీఆర్ ఆరోపణ
  • చేతకాకపోతే వారం రోజులు ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించాలని సవాల్
  • ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళుతున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌ను పోలీసులు పలుచోట్ల అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం జరిగింది. కాళేశ్వరం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని బీఆర్ఎస్ నేతలు పంప్‌హౌస్ వైపునకు దూసుకెళ్లారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయం మొదలైందని, అందుకే తమ పర్యటనను అడ్డుకుంటోందని విమర్శించారు. లక్ష క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతుంటే, ఎగువన ఉన్న మిడ్ మానేరు, కాళేశ్వరం సహా ఏ రిజర్వాయర్‌లోనూ నీరు లేదని అన్నారు. దీంతో రైతులు విత్తనాలు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటార్లు ఆన్ చేస్తే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆ విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించండి, రైతులకు నీరందిస్తాం" అని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు నీళ్లిస్తే యూరియా, మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే సీఎం కావాలనే నీటిని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, తమను అడ్డుకోవడం ద్వారా తన అసమర్థతను బయటపెట్టుకుంటోందని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతోందని ఆరోపిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించేందుకు కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. సుమారు 40 కార్లతో కూడిన కాన్వాయ్‌ను వరంగల్ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంత పెద్ద కాన్వాయ్‌కు అనుమతి లేదని చెప్పగా, కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాసేపు వాగ్వాదం అనంతరం కాన్వాయ్ ముందుకు సాగింది.


Advertisement
KTR
Kaleshwaram Project
BRS Party
KCR
Telangana Politics
Godavari Water

More Telugu News