కియా లాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఎదురు చూస్తున్నాం: కొరియాలో మంత్రి నారా లోకేశ్
- కొరియాలో నారా లోకేశ్ పర్యటన
- సియోల్ లో తెలుగు ఎన్నారైలతో భేటీ
- భారత్‌లో దక్షిణ కొరియాకు ఏపీ నమ్మకమైన భాగస్వామి అని హామీ
- ప్రవాసాంధ్రులంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపు
- స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ (3S) మోడల్‌తో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడి
- బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారత్ సాధ్యమన్న లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "కియా తమ ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, పారదర్శక విధానాలతో వేగవంతమైన అనుమతులు ఇచ్చి నిజమైన భాగస్వామిగా నిలిచింది. ఫలితంగా ఏర్పాటైన కియా ప్లాంట్, కేవలం కార్ల తయారీ కేంద్రంగానే కాకుండా, వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చెందింది. ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని విజయాలు సాధించాలి" అని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ప్రవేశించిందని లోకేశ్ వివరించారు. "ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారులు కోరుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు (స్పీడ్), పాలనా స్థిరత్వం (స్టెబిలిటీ), పెట్టుబడి తర్వాత నాణ్యమైన సేవలు (సర్వీస్) అనే 3S మోడల్‌ను ఏపీ అనుసరిస్తోంది. ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారులకు నమ్మకమైన గమ్యస్థానంగా మారింది" అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లని లోకేశ్ అభివర్ణించారు. "మీరు వెళ్లే ప్రతిచోట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పండి. మా రాష్ట్రంలోని అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరండి" అని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం స్ఫూర్తిదాయకమని, శ్రమ, ఆవిష్కరణలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని కొరియా నిరూపించిందని కొనియాడారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నామని, తద్వారా విద్యార్థులు ప్రపంచస్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారని లోకేశ్ తెలిపారు. "బలమైన రాష్ట్రాలే బలమైన భారత్‌ను నిర్మిస్తాయని మేము బలంగా నమ్ముతాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అభివృద్ధి ప్రణాళికలు కలిస్తేనే విజయం సాధ్యం" అని ఆయన అన్నారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు, నివాసానికి అత్యుత్తమ ప్రదేశంగా మార్చుదామని, తద్వారా బలమైన ఏపీ, బలమైన భారత్‌ను నిర్మిద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు.









