చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ ప్రమాదకర దిశలో పయనిస్తోంది: జగన్
- చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ ప్రమాదకరంగా మారిందని జగన్ విమర్శ
- రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకే ఈ ధోరణి అని ఆరోపణ
- నిజమైన నేరాలను వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని ధ్వజం
- ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్య
"చంద్రబాబు గారూ... రాష్ట్రానికి కావాల్సింది 'రౌడీ పోలీసింగ్' కానీ, 'జంగిల్ రాజ్' కానీ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పరిపాలన, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ, చట్టం ముందు అందరూ సమానమే అని విశ్వసించే సమాజం కావాలి. రాజకీయ ఆదేశాలతో కాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేసే పోలీసు వ్యవస్థ మనకు అవసరం" అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. చంద్రబాబు తన దుర్మార్గపు పాలనతో రాష్ట్రవ్యాప్తంగా విష బీజాలు నాటారని, అవి క్రమంగా మొలకెత్తి విష వృక్షాలుగా మారుతున్నాయని జగన్ అభివర్ణించారు.
పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ జగన్ పలు ఘటనలను ఉదహరించారు. "పిల్లలు కనపించకుండా పోతే దర్యాప్తులో వేగం ఉండదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. గిరిజన మహిళను వివస్త్రను చేసి కొట్టినా అరెస్టులు జరగవు. కానీ, సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, చిత్రహింసలకు గురిచేయడం, నాన్-బెయిలబుల్ సెక్షన్లు ప్రయోగించడం వంటివి చేస్తారా?" అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు, పెద్దాపురంలో మానసిక వికలాంగురాలిపై జరిగిన లైంగిక దాడి కేసు నమోదులో జాప్యం, నెల్లూరు జిల్లాలో మాజీ టీడీపీ కౌన్సిలర్ ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. సాయి కృష్ణ కస్టడీ మరణం, అతని మృతదేహం అదృశ్యం కావడం రాష్ట్రాన్ని కుదుపునకు గురిచేసిందని, అతని తల్లి అడిగే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదని అన్నారు.
క్రాంతి కుమార్ ఆత్మహత్య, అతను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దాన్ని ప్రజలు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా చూడటం తీవ్రంగా కలచివేసిందన్నారు. గంగమ్మ, తిరుపతమ్మ కస్టడీ మరణాలు, పోలీసు వేధింపుల కారణంగా కళావతి ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు తీవ్ర అప్రతిష్టను తెచ్చిపెట్టాయని, అయినా మీ తీరు మారడం లేదని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ పంథాను ఎంచుకున్నారని జగన్ ఆరోపించారు. సాధారణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకుండా, ప్రతి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించి సోషల్ మీడియా కార్యకర్తలపై నాన్-బెయిలబుల్ సెక్షన్లు పెట్టించి, వారి కేసులను వ్యవస్థీకృత నేరాలతో ముడిపెడుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని హెచ్చరించారు. "ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారిని భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అవుతుంది" అని జగన్ తెలిపారు.
యూట్యూబర్, జర్నలిజంలో ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయిన కేవీఆర్‌ను ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా భారీ పోలీసు బలగంతో హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి, అతను చేయని నేరాలకు ఎఫ్‌ఐఆర్‌లో ఇరికించి జైల్లో పెట్టడం అత్యంత దారుణమని జగన్ ఖండించారు. మరో యూట్యూబర్ రావణ్ విషయంలో నాలుగు వేర్వేరు కోర్టులు బెయిల్ మంజూరు చేసినా, విపరీతమైన అహంకారంతో మీ అనుచరులు నేరుగా పోలీస్ స్టేషన్లపై దాడి చేశారని, పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని ఆరోపించారు.
"చంద్రబాబు గారూ... గతంలో మీరు, పవన్ కల్యాణ్, లోకేశ్, మీ పార్టీ నాయకులు ఉపయోగించిన పదాలు, అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు ఈ వ్యక్తులు అడుగుతున్నారు. ఆ లెక్కన మీ మీద కూడా అవే కేసులు పెట్టాలి కదా? విమర్శించే వారిని నేరస్థులుగా చిత్రీకరించడం, చంపాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లపై మీ వాళ్లను పంపడం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ప్రజాస్వామ్య విలువలపై దాడి" అని జగన్ ఉద్ఘాటించారు.