త్వరలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి... అన్ని చోట్లా గెలవాల్సిందే: కుప్పం నుంచి సీఎం చంద్రబాబు పిలుపు
- క్షేత్రస్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్ అవసరమన్న చంద్రబాబు
- అధికారులు, పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచన
- త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని పిలుపు
- పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు ఉంటాయని స్పష్టీకరణ
- కుప్పంలో రౌడీయిజం చేస్తే సహించేది లేదని హెచ్చరిక
శనివారం కుప్పంలో పర్యటనలో భాగంగా రైతులు, పీ4 లబ్దిదారులు, అధికారులతో వరుస భేటీలు నిర్వహించిన అనంతరం, ఆయన నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను అధికారులకు వివరించి, ప్రజా సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేదల పక్షాన నిలిచే టీడీపీ నేతలు, కార్యకర్తలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని, వారిని గౌరవించాలని అన్నారు.
గత ఐదేళ్ల పాలన (2019-24) రాష్ట్రానికి ఒక పీడకల వంటిదని, ఆ సమయంలో కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రశాంతతను దెబ్బతీయాలని నాటి పాలకులు విఫలయత్నం చేశారని చంద్రబాబు విమర్శించారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, కుప్పంలో ఎవరైనా రౌడీయిజం చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, వాటన్నింటిలోనూ టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులే గెలవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు సహా స్థానిక సంస్థలన్నింటినీ కూటమే కైవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉందని, దానికి భంగం కలిగేలా ఎవరూ ప్రవర్తించకూడదని హితవు పలికారు.
పార్టీలో పదవుల కేటాయింపుపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని, నియామకాల్లో ఎలాంటి మొహమాటాలకు, సిఫారసులకు తావుండదని తేల్చిచెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించబోమని భరోసా ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి ఏ పదవికైనా కార్యకర్తల ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి, గతంలో కంటే మెరుగైన మెజారిటీ సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తల ఆర్థిక సాధికారతకు పార్టీ కృషి చేస్తుందని, "ఇంటికో పారిశ్రామికవేత్త" విధానాన్ని పార్టీ కార్యకర్తలు కూడా అందిపుచ్చుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అందరి ఆమోదంతో త్వరలోనే కుప్పంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
