ఆంధ్రప్రదేశ్‌కు కొరియా దిగ్గజ కంపెనీలు... సియోల్‌లో నారా లోకేశ్ కీలక భేటీ

Nara Lokesh key meeting in Seoul to bring Korean giants to Andhra Pradesh
  • దక్షిణ కొరియాలో భారత రాయబారితో మంత్రి నారా లోకేశ్ భేటీ
  • ఏపీకి ఎలక్ట్రానిక్స్, చిప్ కంపెనీలను ఆకర్షించేందుకు సహకరించాలని విజ్ఞప్తి
  • శ్రీసిటీలో 'కొరియా ఎన్‌క్లేవ్' ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్న లోకేశ్
  • అనంతపురం ఆటో క్లస్టర్ విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌పై చర్చ
  • ఏపీ-కొరియా డెస్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ తన దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, కొరియన్ ఎలక్ట్రానిక్స్, చిప్ కంపెనీలను ఏపీకి ఆకర్షించేందుకు చొరవ చూపాలని రాయబారిని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. శాంసంగ్, ఎల్‌జీ, ఎస్‌కే హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ‘రెడీ టు యూజ్’ క్లస్టర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతో కలిసి వీఎల్‌ఎస్‌ఐ, ప్యాకేజింగ్, డిస్‌ప్లే టెక్నాలజీస్ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన 'కొరియా ఎన్‌క్లేవ్' ఏర్పాటుకు శ్రీసిటీలో ప్లగ్-అండ్-ప్లే టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని లోకేశ్ తెలిపారు. ఇది కొరియన్ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతపురంలోని కియా, హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్‌ను మరింత విస్తరించడం, ఏపీ తీరంలో హెచ్‌డి హ్యుందాయ్ తరహాలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం, బ్యాటరీలు, గ్రీన్-హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ఏపీ, కొరియా మధ్య పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కొరియా ప్లస్, కోట్రా (కేఓటీఆర్ఏ) వంటి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఒక ప్రత్యేక 'ఏపీ-కొరియా డెస్క్' ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ నెల 10న సియోల్‌లో నిర్వహించనున్న ఇన్వెస్టర్ రోడ్‌షో విజయవంతం అయ్యేలా, కీలక ఒప్పందాలు కుదిరేలా సహకారం అందించాలని భారత రాయబారిని కోరారు.
Nara Lokesh
Andhra Pradesh
South Korea
Samsung
Semiconductors
Electronics Manufacturing

More Telugu News