ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మద్యం ఏది అని అడిగితే చాలామంది విస్కీ, వోడ్కా లేదా రమ్ అని చెబుతారు. కానీ అది నిజం కాదు. గత 20 ఏళ్లుగా దక్షిణ కొరియాకు చెందిన 'సోజు' అనే డ్రింక్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా 'జిన్‌రో సోజు' అనే బ్రాండ్, ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లను వెనక్కి నెట్టి ఏటా అమ్మకాలలో రికార్డులు సృష్టిస్తోంది.

ఏమిటీ సోజు?

సోజు అనేది కొరియా జాతీయ మద్యం. ఇది చూడటానికి నీళ్లలా స్వచ్ఛంగా ఉంటుంది. సాంప్రదాయకంగా బియ్యంతో తయారుచేసినా, ప్రస్తుతం గెనుసు గడ్డలు, బార్లీ, గోధుమలతో కూడా దీనిని స్వేదన ప్రక్రియ (distillation) ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో ఆల్కహాల్ శాతం సాధారణంగా 12 నుంచి 25 శాతం మధ్య ఉంటుంది. ఇది విస్కీ, వోడ్కా కంటే తక్కువ, బీర్, వైన్ కంటే ఎక్కువ. దీని రుచి తియ్యగా, సున్నితంగా ఉండటంతో తాగడానికి సులువుగా ఉంటుంది.

ఆదరణకు కారణాలు

సోజు ఇంతలా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం 'కొరియన్ వేవ్'. ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న కె-డ్రామాలు, కె-పాప్ సంగీతంలో తరచూ కనిపించే ఆకుపచ్చ రంగు సోజు బాటిల్, దానిపై ఆసక్తిని విపరీతంగా పెంచింది. దీనికి తోడు తక్కువ ఆల్కహాల్ ఉండటంతో, మరుసటి రోజు హ్యాంగోవర్ తక్కువగా ఉంటుందని యువత దీనిని ఇష్టపడుతోంది. పీచ్, స్ట్రాబెర్రీ వంటి అనేక ఫ్రూట్ ఫ్లేవర్లలో లభించడం, గ్రిల్డ్ మీట్, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలతో చక్కగా సరిపోవడం దీని ఆదరణకు ఇతర కారణాలు.

భారత్‌లోనూ, ముఖ్యంగా నగరాల్లోని యువతలో సోజుకు క్రేజ్ పెరుగుతోంది. పన్నులు, లభ్యత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మారుతున్న డ్రింకింగ్ సంస్కృతిలో సోజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది.