కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం.. మనవడి మరణం తట్టుకోలేక తాత కన్నుమూత!
- కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూత
- మనవడి మరణంతో మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం
- 'మిస్ యూ డాడ్' అంటూ సోషల్ మీడియాలో కేతన్ తండ్రి భావోద్వేగ పోస్ట్
కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, దేవీచంద్కు కొంతకాలం క్రితమే మేజర్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో అత్యంత పాశవికంగా జరిగిన మనవడు కేతన్ హత్య ఆయనను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ ఘటన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ దేవీచంద్ కన్నుమూశారు.
కాగా, కొద్ది వారాల క్రితం పూణెలోని లోహగడ్ కోట వద్ద లోయలోకి తోసి కేతన్ అగర్వాల్ (26)ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) నిందితులుగా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వెలికితీసిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేతన్‌ను ఎలా చంపాలనే దానిపై నిందితులు గూగుల్, యూట్యూబ్‌లలో వెతికారని, చివరికి కోట పైనుంచి తోసేయడమే సులభమైన మార్గమని నిర్ధారణకు వచ్చారని తేలింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అయితే పెళ్లిని రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని భావించిన సియా, ఈ దారుణానికి కుట్ర పన్నినట్లు దర్యాప్తులో అంగీకరించింది.