ఏలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
- ఏలూరు జిల్లా చెబ్రోలు సమీపంలో ఘటన
- ప్రమాదంలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి
- ఇది ఆత్మహత్యగా భావిస్తున్న రైల్వే పోలీసులు
- మృతుల వద్ద ఏటీఎం కార్డు, బైక్ పార్కింగ్ రసీదు లభ్యం
- గుర్తింపు కోసం దెబ్బతిన్న మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్న అధికారులు
వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు, చెబ్రోలు సమీపంలో రైలు పట్టాలపై వెళ్తున్న నలుగురిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమవ్వడంతో మృతులను గుర్తించడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఘటనా స్థలంలో "షేక్ హసీనా" పేరుతో ఉన్న ఏటీఎం కార్డుతో పాటు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బైక్ పార్కింగ్ రసీదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన రెండు పగిలిన మొబైల్ ఫోన్ల సిమ్ కార్డుల ఆధారంగా మృతుల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.