'ఏక్ దో తీన్' పాట గురించి ఇన్నాళ్లకు అసలు విషయం బయటపెట్టిన అనిల్ కపూర్!
- 'ఏక్ దో తీన్' పాటను మొదట మాధురి దీక్షిత్‌పై మాత్రమే చిత్రీకరించాలనుకున్న చిత్రబృందం
- పాట కచ్చితంగా హిట్ అవుతుందని భావించి, అందులో తనకూ పాత్ర ఉండాలని పట్టుబట్టానని చెప్పిన అనిల్ కపూర్
- సంగీత దర్శకుడు, గేయ రచయితను ఒప్పించి పాటలో మార్పులు చేయించానని వెల్లడి
- 1988లో వచ్చిన 'తేజాబ్' చిత్రంలోని ఈ పాట అప్పట్లో ఓ సంచలనం
- ప్రస్తుతం 'ఆల్ఫా', 'కింగ్' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనిల్
ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొన్న అనిల్ కపూర్ 'తేజాబ్' నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. "ఏక్ దో తీన్ పాట విన్న తర్వాత ఇది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని నాకు అనిపించింది. వెంటనే నేను సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్ వద్దకు వెళ్లి 'ఈ పాటలో నేను కూడా ఉంటాను' అని అడిగాను. కానీ ఆయన ఇది అమ్మాయిల పాట అని చెప్పారు. దానికి నేను 'అది నాకు అనవసరం... నేను ఈ పాటలో ఉండాల్సిందే' అని బదులిచ్చాను" అని అనిల్ తెలిపారు.
ఆ తర్వాత ప్రముఖ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్‌కు ఫోన్ చేసి, పాటలోని సాహిత్యాన్ని మార్చమని కోరినట్లు చెప్పారు. "నిజానికి ఆ పాట స్క్రిప్ట్‌లో లేదు. కానీ నేనే పట్టుబట్టి దాన్ని జరిగేలా చేశాను" అని అనిల్ కపూర్ వివరించారు. ఎన్. చంద్ర దర్శకత్వంలో వచ్చిన 'తేజాబ్' ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వాస్తవానికి ఈ చిత్రంలో మొదట 'ఏక్ దో తీన్' ఫిమేల్ వెర్షన్ సాంగ్ నే అనుకున్నారు. కానీ అనిల్ కపూర్ కోరిక కాదనలేక మేల్ వెర్షన్ సాంగ్ ను కూడా పెట్టారు.
ప్రస్తుతం అనిల్ కపూర్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న 'ఆల్ఫా' చిత్రంలో అలియా భట్, బాబీ డియోల్‌తో కలిసి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలో కూడా ఆయన కనిపించనున్నారు.