సినిమా వాళ్లకు అదొక పెద్ద జబ్బు: రామ్ గోపాల్ వర్మ
- ఇండస్ట్రీలో సృజనాత్మకత పడిపోయిందన్న వర్మ
- కథలను నమ్మి సినిమాలు తీయడం మానేశారని విమర్శ
- వసూళ్లు, మార్కెట్ లెక్కల కోసం పరిగెడుతున్నారన్న వర్మ
కథల ఎంపికలో నేటి తరం దర్శకులు, రచయితలు అనుసరిస్తున్న తీరుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చిత్ర పరిశ్రమలోని సృజనాత్మకత ఏ స్థాయికి పడిపోయిందో వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
ప్రస్తుతం చిత్రసీమ ఒక విచిత్రమైన మానసిక రోగంతో బాధపడుతోందని వర్మ వ్యాఖ్యానించారు. మేకర్స్ తమకు నచ్చిన వైవిధ్యమైన కథలను నమ్మి సినిమాలు తీయడం ఎప్పుడో పక్కనబెట్టేశారని ఆరోపించారు. జనాలు థియేటర్లలో ఏం చూడాలనుకుంటున్నారో ముందే ఊహించుకుని, దానికి తగ్గట్టు రొటీన్ కథలను వండటమే ఇండస్ట్రీకి అతిపెద్ద శాపమని దుయ్యబట్టారు.
బాక్సాఫీస్ వసూళ్లు, మార్కెట్ లెక్కల కోసమే నేటి తరం నిర్మాతలు, దర్శకులు పరిగెడుతున్నారని... ఈ వ్యాపార ధోరణి వల్ల సినిమాల్లో సహజత్వం పూర్తిగా లోపించిందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల నాడి పట్టుకుంటామనే భ్రమలో... కథకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఫైట్లు, డ్యూయెట్లు, రొటీన్ లవ్ ట్రాక్ల వంటి కమర్షియల్ హంగులను బలవంతంగా చొప్పించి సినిమా అసలు ఉద్దేశాన్నే పాడుచేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.