తాడేపల్లి నుంచి ఎంత డబ్బు అందుతోంది?: ప్రకాశ్ రాజ్ పై కందుల దుర్గేశ్ ఫైర్
- రావణ్ కు మద్దతుగా నిలిచిన ప్రకాశ్ రాజ్
- కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు
- రావణ్ తో ఉన్న చీకటి సంబంధాలు ఏమిటో చెప్పాలని డిమాండ్
యూట్యూబర్ ప్రశ్న రావణ్ (జోసెఫ్) అరెస్టుల పర్వంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఘాటుగా బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కావాలనే అశాంతిని, ఘర్షణ వాతావరణాన్ని రగిల్చేందుకు ఒక ముఠా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మీడియా ముఖంగా ప్రకాశ్ రాజ్, రావణ్‌లపై విరుచుకుపడిన మంత్రి... వారిద్దరినీ సమాజ విద్రోహ శక్తులుగా అభివర్ణించారు. అసలు ఈ వివాదాస్పద యూట్యూబర్‌తో ప్రకాశ్ రాజ్‌కు ఉన్న చీకటి సంబంధాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎన్నో అకృత్యాలు సాగాయని, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని.. అప్పుడు లేవని ప్రకాశ్ రాజ్ గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ నిలదీశారు. "నాడు మూగనోము నోమిన మీరు.. నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నెలా ఎంత డబ్బు అందుకుంటున్నారు?" అంటూ నేరుగా ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి శాంతిభద్రతలను దెబ్బతీయడానికే ఇలాంటి శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వీటిని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని మంత్రి హెచ్చరించారు.