తెలంగాణ... పాక్, శ్రీలంకలా దివాలా తీస్తుంది: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay warns Telangana will face Pakistan Sri Lanka fate under Congress BRS
  • రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుల కుప్పగా మార్చాయన్న సంజయ్
  • రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై రుద్దారని మండిపాటు
  • రాష్ట్రం అభివృద్దిపథంలో సాగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్య

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు.


రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర అప్పుల భారాన్ని సామాన్యుడి నెత్తిన రుద్దారని దుయ్యబట్టారు. ఈ తరహా బాధ్యతారాహిత్యమైన ధోరణి ఇలాగే కొనసాగితే... భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా పాకిస్థాన్, శ్రీలంకల మాదిరి దివాలా తీసే దుస్థితికి చేరుకుంటుందని హెచ్చరించారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కి ప్రగతిపథంలో పయనించాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రతి చిన్న అభివృద్ధి వెనుక మోదీ సర్కార్ పంపిన నిధులే ఉన్నాయని గుర్తుచేశారు.


పల్లెల ప్రగతి కోసం ఢిల్లీ నుంచి నేరుగా వస్తున్న ఆర్థిక సంఘం నిధులను సైతం ఇక్కడి పాలకులు జీతాల చెల్లింపుల కోసం దారిమళ్లిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజాహిత పథకాలపై కోర్టులకెళ్లడం ఏంటని ప్రశ్నించిన ఆయన... వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి కల్పించి శాశ్వత సంపదను సృష్టిస్తుంటే... దానిపై కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీకి దక్కుతున్న ఆదరణను తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈర్ష్యతో ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నాయని, కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.

Bandi Sanjay
Telangana Debt Crisis
Congress BRS Criticism
Telangana Financial Status
Narendra Modi Central Funds
Telangana BJP

More Telugu News