మమతా బెనర్జీకి భారీ షాక్.. పార్టీకి బెంగాల్ అధ్యక్షురాలు రాజీనామా
- బెంగాల్ టీఎంసీ అధ్యక్ష పదవికి చంద్రిమ భట్టాచార్య రాజీనామా
- పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటన
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో ముదిరిన సంక్షోభం
- రాజీనామా అనంతరం తిరుగుబాటు నేతలతో భేటీ
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ ఆరంభంలో మమతా బెనర్జీ పాత కమిటీలను రద్దు చేసి, చంద్రిమను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. అయితే, బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఆమె రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. తన రాజీనామా లేఖలో మమతా బెనర్జీ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చంద్రిమ పేర్కొన్నారు.
ప్రస్తుతం టీఎంసీలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రితబ్రత బెనర్జీ వర్గంతో మెజారిటీ ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. తన రాజీనామాను సమర్పించిన వెంటనే చంద్రిమ భట్టాచార్య అసెంబ్లీలో రెబల్ నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీలలో సుమారు 20 మంది ఎన్డీఏకు మద్దతిస్తున్న మరో పార్టీలో విలీనమయ్యారు.
చంద్రిమ రాజీనామాపై మమత బెనర్జీ వర్గం నేతలు స్పందించారు. పార్టీలో కీలక పదవులను అనుభవించి, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరైనది కాదని ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. టీఎంసీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందనడానికి ఇదే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు.