నాన్న ఆ ఒక్క నిర్ణయం తీసుకోకపోతే.. తన కెరీర్ మలుపుపై సంజూ శాంసన్ భావోద్వేగం
- ఢిల్లీ క్రికెట్ జట్టులో చోటు దక్కకపోవడంపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఢిల్లీ జట్టుకు ఎంపిక కాకపోవడంతో తండ్రి వెంటనే కేరళకు మకాం మార్చారని వెల్లడి
- ఆ నిర్ణయమే తన కెరీర్‌కు కీలక మలుపు అని.. కేరళ తరఫున ఆడటం మొదలుపెట్టానని వివరణ
- ఢిల్లీ పోలీస్ క్వార్టర్స్‌లో గల్లీ క్రికెట్‌తో తన ప్రయాణం మొదలైందని గుర్తుచేసుకున్న శాంసన్
- ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తన తండ్రి, తనలోని టాలెంట్ గుర్తించి క్రికెట్ వైపు ప్రోత్సహించారని వెల్లడి
ఢిల్లీలో తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. "నిజాయతీగా చెప్పాలంటే నా జీవితంలో ఢిల్లీ చాలా పెద్ద పాత్ర పోషించింది. నాన్న ఢిల్లీ పోలీస్ ఫుట్‌బాల్ జట్టులో ఉండేవారు. పోలీస్ క్వార్టర్స్‌లో ఉండటంతో అక్కడి వాతావరణం నన్ను క్రీడల వైపు ఆకర్షించింది. స్నేహితులు డీడీసీఏ జాకెట్లు వేసుకుని రాష్ట్ర జట్టుకు ఆడటం గురించి మాట్లాడుతుంటే, నాకూ ఢిల్లీ తరఫున ఆడాలనే కోరిక కలిగింది. దీని కోసం ట్రయల్స్‌కు వెళ్లాను, స్టేట్ క్యాంపుల్లో పాల్గొన్నాను, పరుగులు కూడా చేశాను" అని శాంసన్ తెలిపాడు.
అయితే, తీవ్రమైన పోటీ కారణంగా తనకు అవకాశం రాలేదని వివరించాడు. "రెండు మూడు సార్లు క్యాంపులకు ఎంపికయ్యాను. కానీ, రాష్ట్ర జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఒకరోజు ట్రయల్స్ ముగిశాక తుది జట్టు జాబితా ప్రకటించారు. అందులో నా పేరు లేదు. మేమంతా మౌనంగా ఇంటికి వచ్చాం. ఇంటికి చేరుకోగానే నాన్న అమ్మతో, 'మనం కేరళకు వెళ్లాలి. సామాన్లు సర్దుకోండి' అన్నారు. అమ్మ ఆశ్చర్యపోయి, 'పిల్లలు ఇంకా 6వ తరగతిలోనే ఉన్నారు. కనీసం 10వ తరగతి పూర్తి చేయనివ్వండి' అంది. కానీ నాన్న, 'లేదు, మనం ఇప్పుడే వెళ్లాలి. మూడు రోజుల్లో టిక్కెట్లు బుక్ చేస్తున్నా' అని తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మేమంతా రైలెక్కి కేరళకు చేరుకున్నాం. అలా కేరళ రాష్ట్ర జట్టు తరఫున నా క్రికెట్ ప్రయాణం మొదలైంది" అని శాంసన్ భావోద్వేగంతో చెప్పాడు.
తన తండ్రి ఫుట్‌బాల్ ప్లేయర్ అయినప్పటికీ, తనలోని క్రికెట్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారని శాంసన్ తెలిపాడు. "నాన్న నన్ను ఫుట్‌బాల్ వైపు ఎప్పుడూ బలవంతం చేయలేదు. నా బ్యాటింగ్ చూసి, 'నీలో టాలెంట్ ఉంది' అని నన్ను, మా అన్నను క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు" అని అన్నాడు.
ఫిరోజ్ షా కోట్లా (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం) మైదానంతో ముడిపడి ఉన్న ఒక మధుర జ్ఞాపకాన్ని కూడా సంజూ పంచుకున్నాడు. "ఒకరోజు నాన్న నన్ను ప్రాక్టీస్ కోసం ఫిరోజ్ షా కోట్లాకు తీసుకెళతానన్నారు. అక్కడ ఆయనకు డ్యూటీ ఉండటంతో ఒక గంట ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి కోరారు. అలా నేను, మా అన్నయ్య, నాన్న కలిసి నెట్స్‌లో గంటసేపు ప్రాక్టీస్ చేశాం. అది దేవుడి ఆశీర్వాదంలా భావిస్తాను. ఆ రోజు నాన్న అది ఎలా మేనేజ్ చేశారో తెలియదు కానీ, అదొక మర్చిపోలేని అనుభూతి" అని సంజూ శాంసన్ తన పాత రోజులను గుర్తుచేసుకున్నాడు.