బీటెక్‌లో 24 బ్యాక్‌లాగ్‌లు.. కట్‌ చేస్తే 18 నెలల్లో ఐపీఎస్‌ ఆఫీసర్‌!

Sameer Sharma 24 Backlogs in BTech but IPS Officer in 18 Months
  • పదో తరగతిలో సమీర్‌ శర్మకు 57% మార్కులు
  • ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 34% మాత్రమే
  • ఇంజినీరింగ్‌ తర్వాత యూపీఎస్సీకి సన్నద్దం
  • 18 నెలల్లో ఆల్‌ ఇండియా 182వ ర్యాంకు
  • ఢిల్లీ పోలీసులో అదనపు డీసీపీ సహా పలు కీలక బాధ్యతలు
  • తక్కువ మార్కులు విజయానికి అడ్డంకి కాదని నిరూపణ
మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలా మంది భావిస్తారు. ఒకసారి చదువులో వెనుకబడితే అంతే అనుకుని నిరాశలోకి వెళ్లిపోతారు. కానీ పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ వైఫల్యాన్నైనా విజయంగా మార్చుకోవచ్చని నిరూపించారు ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మ. 

సమీర్‌ శర్మ స్కూల్‌ రోజుల నుంచే మెరిట్‌ విద్యార్థి కాదు. పదో తరగతిలో 57 శాతం మార్కులు సాధించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారింది. కేవలం 34 శాతం మార్కులే వచ్చాయి. తర్వాత కొంత మెరుగుపడి ఇంటర్‌ పూర్తిచేసే సమయానికి సుమారు 60 శాతం మార్కులు సాధించారు. అయితే అతడు ఐపీఎస్‌ అధికారి అవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.

చదువు పూర్తయ్యాక బీటెక్‌లో చేరారు. కొత్త జీవితానికి అది మంచి ప్రారంభం అవుతుందని భావించారు. కానీ ఇంజినీరింగ్‌ ఆయనకు అత్యంత కఠినమైన దశగా మారింది. చదువులో ఇబ్బందులు ఎదురవడంతో మొత్తం 24 బ్యాక్‌లాగ్స్‌ పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటారు. సమీర్‌ మాత్రం అలా చేయలేదు. తన వైఫల్యాలను జీవితానికి ముగింపు కాకుండా కొత్త ప్రారంభంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌పై దృష్టి పెట్టారు. క్రమశిక్షణతో చదవడం ప్రారంభించారు. ప్రతిరోజూ నిరంతరం శ్రమించారు. ఇతరులతో పోల్చుకోకుండా తన లక్ష్యంపైనే దృష్టి పెట్టారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివిన అభ్యర్థులను చూసి తాను తక్కువనుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు.

ఆ కృషి ఫలితంగా కేవలం 18 నెలల్లోనే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. ఆల్‌ ఇండియా ర్యాంకు 182 దక్కించుకున్నారు. 2011 బ్యాచ్‌ ‘ఏజీఎంయూటీ’ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. అనంతరం ఢిల్లీ పోలీస్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (అడిషనల్‌ డీసీపీ)గా కూడా సేవలందించారు.

తన గత వైఫల్యాలను సమీర్‌ ఎప్పుడూ దాచిపెట్టలేదు. వాటినే విద్యార్థులకు స్ఫూర్తిగా చెబుతుంటారు. విజయానికి ముందు మనసులోని భయాన్ని, ఆత్మన్యూనతను జయించాలని సూచిస్తారు. ఇతరుల విజయాలతో మన ప్రారంభాన్ని పోల్చుకోవద్దని చెబుతారు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుందని గుర్తు చేస్తారు. లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక దక్కుతుందని యువతకు సందేశం ఇస్తుంటారు.

సమీర్‌ శర్మ ప్రయాణం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. తక్కువ మార్కులు, బ్యాక్‌లాగ్స్‌ లేదా గత వైఫల్యాలు భవిష్యత్తును నిర్ణయించవు. వాటిని అధిగమించే పట్టుదలే మన జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళుతుంది.
Sameer Sharma
IPS Officer Sameer Sharma
UPSC Success Story
BTech Backlogs to IPS
Delhi Police Additional DCP
Civil Services Exam Motivation

More Telugu News