స్పీడ్ పోస్టులో గంజాయి దందా: భారీ నెట్వర్క్ బట్టబయలు చేసిన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్
- స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు
- ఝార్ఖండ్ కేంద్రంగా దేశంలోని 21 రాష్ట్రాలకు డ్రగ్స్ పంపిణీ
- 'మందులు' అని చెప్పి పార్శిళ్లలో గంజాయి ప్యాక్ చేసి దందా
- హైదరాబాద్‌లో ఇద్దరు కొనుగోలుదారుల అరెస్ట్, 2 కిలోల గంజాయి స్వాధీనం
- పోస్టల్ పార్శిళ్లకు స్కానింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామన్న పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం, ఝార్ఖండ్‌లోని గిరిడ్ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా ఈ ముఠాను నడుపుతున్నాడు. స్థానికంగా లభించే గంజాయిని సేకరించి, 'ఔషధాలు' అని తప్పుడు డిక్లరేషన్‌తో పార్శిళ్లలో ప్యాక్ చేసి, స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలోని 21 రాష్ట్రాలకు పంపేవాడు. వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, యూపీఐ ద్వారా నగదు స్వీకరించేవాడు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా రోజుకు రూ. 1 లక్ష, నెలకు రూ. 30 నుంచి 35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా వార్షిక టర్నోవర్ సుమారు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ముఠాలో సత్యం మిశ్రా సోదరుడు శుభం మిశ్రాతో పాటు మరికొందరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఝార్ఖండ్ నుంచి పంపిన కొన్ని పార్శిళ్లను హైదరాబాద్‌లో అధికారులు అడ్డుకోవడంతో ఈ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలో పార్శిళ్లు అందుకున్న సుశాంత్ వ్యాస్, లడ్డూ అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గుడిమల్కాపూర్, ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటన పోస్టల్ సర్వీసుల్లోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోందని, పార్శిళ్లకు తప్పనిసరిగా స్కానింగ్ ప్రక్రియను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల బృందం ఈ ఆపరేషన్‌ను అత్యంత చాకచక్యంగా పూర్తి చేసింది.