మెహర్ రమేశ్ ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ప్రత్యేక ఆకర్షణగా మెగా బ్రదర్స్
- దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె మోహన వివాహం
- తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో పెళ్లి
- హాజరైన చిరంజీవి, పవన్ కల్యాణ్ దంపతులు
- తరలివచ్చిన టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు
- మెగా కుటుంబానికి బంధువైన మెహర్ రమేశ్
ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి హాజరై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన అర్ధాంగి అన్నా లెజెనోవాతో కలిసి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ నుంచి అగ్ర హీరో వెంకటేశ్, ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఎన్. శంకర్, వీర శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వినీదత్, ఏఎం రత్నం, బన్నీ వాసు, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, నటుడు మురళీ మోహన్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, యాంకర్ సుమ కనకాల తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ రంగం నుంచి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, గంటా శ్రీనివాస్, అంబటి రాంబాబు వంటి నేతలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
మెహర్ రమేశ్ కు మెగా ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తల్లి అంజనా దేవి, మెహర్ రమేశ్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు. ఈ బంధుత్వం కారణంగా చిన్నప్పటి నుంచే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో మెహర్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. మెగా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఆయన చేదోడు వాదోడుగా ఉంటారు. ఇటీవల చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కించారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద శిష్యరికం చేసిన మెహర్ రమేశ్.. కన్నడలో 'వీరకన్నడిగ', 'అజయ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'కంత్రి', ప్రభాస్‌తో 'బిల్లా', వెంకటేశ్‌తో 'షాడో' చిత్రాలను రూపొందించారు. మహేశ్ బాబుతోనూ ఆయనకు మంచి స్నేహం ఉంది. గతంలో మహేశ్ హీరోగా నటించిన 'బాబీ' సినిమాలో ఆయన స్నేహితుడిగా మెహర్ రమేశ్ కనిపించారు.