హిందూ వివాహాలపై గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Gujarat High Court sensational verdict on Hindu marriages
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన పెళ్లి జరిగినట్టు కాదన్న హైకోర్టు
  • అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయాల్సిందేనని వ్యాఖ్య
  • పెళ్లి అంటే విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదన్న హైకోర్టు

హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను చాటిచెబుతూ గుజరాత్ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' (ఏడడుగులు) వంటి శాస్త్రోక్తమైన క్రతువులు నిర్వహించకుండా, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహం అనేది కేవలం 'పాటలు, డ్యాన్స్‌లు, విందు వినోదాల' కోసం జరుపుకునే వేడుక కాదని, వధూవరులు పవిత్రమైన అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయడమే వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తుందని జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి. వాచ్ఛానిల బెంచ్ తేల్చిచెప్పింది.


యూకేలో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే వ్యక్తి అప్పీల్‌పై విచారణ జరుపుతూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ తన సంతకాలను మోసపూరితంగా సేకరించి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిందని, తమ మధ్య ఎలాంటి సంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని కౌశల్ కోర్టును ఆశ్రయించాడు. గతంలో ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించగా, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో సదరు మహిళ కూడా తమ మధ్య ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని అంగీకరించింది. దీంతో, హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది లేని వివాహం అసలు పెళ్లే కాదని స్పష్టం చేస్తూ, గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆ పెళ్లి చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

Gujarat High Court
Hindu Marriage Act
Saptapadi rituals
Marriage registration certificate
Kaushal Sonar
Ahmedabad

More Telugu News