‘బాత్రూమ్‌లో నగదు దాచేవాళ్లం’.. రామ మందిర విరాళాల కేసులో నిందితుడి వాంగ్మూలం!

Avinash Shukla statement in Ram Mandir donation case reveals cash hidden in bathrooms
  • సీసీటీవీ కెమెరాల స్థానాలు ముందే తెలుసని వెల్లడి
  • చోరీ సొమ్ముతో భూములు, ఇల్లు కొనుగోలు చేసినట్లు అంగీకారం
  • నిందితుల ఆస్తులు, లావాదేవీలపై దర్యాప్తు
  • రూ.58 లక్షలు ఎఫ్‌ఐఆర్‌కు ముందే స్వాధీనం చేసుకున్న సమాచారం
అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాశ్ శుక్లాను పోలీసులు విచారించారు. చోరీ చేసిన నగదును ముందుగా మరుగుదొడ్లలో దాచేవాళ్లమని, తర్వాత అవకాశం చూసుకుని బయటకు తరలించేవాళ్లమని చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఆలయ ట్రస్టీ అనిల్‌ మిశ్రా కీలక పాత్ర పోషించేవారని కూడా అవినాశ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. దర్యాప్తు ప్రకారం.. విరాళాల లెక్కింపు గది తాళాల్లో ఒకటి రామశంకర్‌ అలియాస్‌ టిన్నూ యాదవ్‌ వద్ద ఉండేది. మరో తాళం బ్యాంకు సిబ్బంది వద్ద ఉండేదని నిందితుడు తెలిపాడు. పలువురు కలిసి పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడేవారని, ఒకరు నగదు తీస్తుండగా మిగిలినవారు అతడికి అడ్డుగా నిలిచేవారని వెల్లడించాడు.

ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో తమకు ముందే తెలుసని, వాటికి కనిపించకుండా కదిలేవాళ్లమని కూడా నిందితుడు చెప్పినట్లు సమాచారం. సీసీటీవీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ తమ కదలికలను ఎవరూ నిశితంగా గమనించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన సొమ్ముతో భూములు, ఇల్లు కొనుగోలు చేసినట్లు కూడా నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో నిందితుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జూన్‌ 13న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. అయితే అంతకుముందే జూన్‌ 5న అవినాశ్‌ శుక్లా ఇంటి నుంచి రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు బయటపడింది. మిగిలిన మొత్తాన్ని జూన్‌ 5 నుంచి 8 మధ్య బ్యాంకు ఖాతాల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకముందే నిధుల రికవరీ ప్రక్రియ ప్రారంభమైనట్లు దర్యాప్తులో తేలింది.
Avinash Shukla
Ayodhya Ram Mandir
Donation Theft Case
Ram Mandir SIT Investigation
Uttar Pradesh Police
Temple Donation Scam

More Telugu News