ఫోరెన్సిక్ సైన్స్‌లో నూతన అధ్యాయం.. ఇక సామాన్యులకు అందుబాటులో అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ సేవలు
- నోయిడాకు చెందిన లక్షర్ ఎవిడెన్స్ ల్యాబ్స్‌కు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్
- పలు ఫోరెన్సిక్ విభాగాల్లో ఒకేసారి గుర్తింపు పొందిన తొలి భారతీయ ప్రైవేట్ ల్యాబ్
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో యూపీలో ఈ ఘనత సాధించిన మొదటి ల్యాబొరేటరీ
- సామాన్యులకు, న్యాయవాదులకు, సంస్థలకు ఇకపై అందుబాటులో అధునాతన సేవలు
ఈ అక్రిడిటేషన్ డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫిజికల్ ఫోరెన్సిక్స్, క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ వంటి కీలక విభాగాలకు వర్తిస్తుందని లక్షర్ ల్యాబ్స్ తెలిపింది. అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ల్యాబొరేటరీలోని పరీక్షా పద్ధతులు, నాణ్యతా నిర్వహణ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, పరికరాల క్యాలిబ్రేషన్, సిబ్బంది శాస్త్రీయ నైపుణ్యం వంటి అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత ఎన్ఏబీఎల్ ఈ గుర్తింపును మంజూరు చేసింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ పొందిన మొట్టమొదటి ల్యాబొరేటరీ కూడా తమదేనని కంపెనీ గర్వంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా లక్షర్ ఎవిడెన్స్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ డైరెక్టర్ ఇంద్రజీత్ రాయ్ మాట్లాడుతూ.. "ఇది కేవలం మా సంస్థకు మాత్రమే లభించిన మైలురాయి కాదు, సైన్స్ ద్వారా న్యాయం కోరుకునే ప్రతి పౌరుడికి దక్కిన విజయం. ఇప్పటివరకు ప్రభుత్వ ఏజెన్సీలకే పరిమితమైన అక్రిడిటేషన్ పొందిన ఫోరెన్సిక్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధాన లక్ష్యం. నేటి నుంచి ప్రతి వ్యక్తి, న్యాయవాది, వ్యాపారవేత్త, సంస్థలు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రయోగశాల నుంచి విశ్వసనీయమైన, శాస్త్రీయంగా ధృవీకరించబడిన ఫోరెన్సిక్ సాక్ష్యాలను పొందే అవకాశం లభించింది" అని వివరించారు.
భారత ప్రభుత్వ నాణ్యతా మండలి (Quality Council of India) కింద పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఎన్ఏబీఎల్, ప్రయోగశాలల సాంకేతిక నైపుణ్యం, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను కఠినంగా పరిశీలించిన తర్వాతే అక్రిడిటేషన్‌ను మంజూరు చేస్తుంది.
ఈ గుర్తింపుతో ఇకపై వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు, న్యాయ నిపుణులు, దర్యాప్తు ఏజెన్సీలు.. డిజిటల్, మొబైల్ పరికరాల ఫోరెన్సిక్స్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, చేతిరాత, సంతకాల విశ్లేషణ, వేలిముద్రల పరిశీలన, ఆడియో, వీడియో ఫోరెన్సిక్స్, క్లౌడ్ ఫోరెన్సిక్స్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ వంటి అధునాతన సేవలను పొందవచ్చని కంపెనీ పేర్కొంది. తాము అందించే ఫోరెన్సిక్ పరీక్షలు, నిపుణుల అభిప్రాయాలు 'భారతీయ సాక్ష్య అధినియం-2023' నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని, న్యాయపరమైన, దర్యాప్తు ప్రక్రియలలో వినియోగానికి వీలు కల్పిస్తాయని స్పష్టం చేసింది. ఈ పరిణామం దేశంలో న్యాయం పొందే ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, పారదర్శకంగా మార్చడానికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.